- నీళ్లు నిండిన పొలాలు
- తడిసి ముద్దయిన మన్యం
పాడేరు,న్యూస్‌లైన్: ఏజెన్సీలో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడి న వర్షం జనాన్ని ఆందోళనకు గురిచేసింది. జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. పంట భూములన్నీ నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి.
ఖరీఫ్ పంటలకు అనుకూలమని రైతులు ఆనందపడుతున్నప్పటికీ ఈదురు గాలుల వల్ల మామిడి పంటకు నష్టం తప్పదంటున్నారు. గాలులకు పలు చోట్ల తీగలపై చెట్ల కొమ్మలుపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
డుంబ్రిగుడ: డుంబ్రిగుడలో వర్షం కురవడానికి ముందు భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు రావడంతో జనం భయకంపితులయ్యారు. వారం నుంచి మండుతున్న ఎం డల వల్ల ఉక్కపోతకు గురైన ప్రజలకు సోమవారంనాటి వానతో కాసింత సేదదీరారు.
చింతపల్లిరూరల్: చింతపల్లిలో సోమవారం మధ్యాహ్నం కురిసిన ఈదురుగాలులతో కురిసిన వర్షానికి రెండుగంటల పాటు స్థానికులు భయాందోళలకు గురయ్యారు. గడిచిన 15 రోజులుగా ఎప్పుడు ఈ ప్రాంతంలో వర్షం కురిసినా గాలి, వానలు, మెరుపులు, ఉరుములు, పిడుగులతో భయాందోళనలు సృష్టింస్తున్నాయి.
నాలుగురోజులపాటు ప్రశాంతంగా ఉన్న చింతపల్లిలో సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కారుమబ్బులు కమ్మి భారీ వర్షం కురవడంతో రాకపోకలు సాగించడానికి వాహన చోదకులు, ఇళ్ళ నుంచి బయటకు రావడానికి స్థానికులు సైతం భయపడ్డారు. ఇటీవల కాలంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఉరుముల శబ్దానికి గృహోపకరణాలు దగ్ధమవుతుండడంతో ప్రజలు వర్షం వచ్చిందంటే ఆందోళన చెందుతున్నారు.