ఎటు చూసినా పూలతోటలే.. | Floriculture Flourish in Amaravati Region | Sakshi
Sakshi News home page

పరిమళాల పురి

Published Wed, Dec 11 2019 7:47 AM | Last Updated on Wed, Dec 11 2019 8:05 AM

Floriculture Flourish in Amaravati Region - Sakshi

బేతపూడిలో సాగులో ఉన్న లైన్‌ఆకు, కనకాంబరం, బంతి, విరజాజి పూలతోటలు

ఆ ప్రాంతంలో అడుగు పెడితే చాలు.. సరికొత్త లోకంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. ఎటు చూసినా పూలతోటలే కనిపిస్తాయి. రంగు రంగుల పూల సువాసనలు పరిమళిస్తాయి. ఇక్కడి వారికి తరతరాలుగా పూలే ప్రపంచం.. వాటితోనే అనుబంధం.. వారి జీవితాలు పూలతోనే మమేకం. ఆ పూలసాగే వారికి వ్యాపకం.. జీవనోపాధి. ఇక్కడి పూలు రాష్ట్రంలోనే కాదు.. తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లోనూ గుభాళిస్తున్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల పరిసర ప్రాంతాల్లోని రైతులు సాగుచేస్తున్న పూల తోటలపై ప్రత్యేక కథనం..  

సాక్షి, అమరావతి బ్యూరో: బాపట్ల రూరల్‌ పరిధిలోని బేతపూడి, వెదుళ్లపల్లె, కొత్తపాలెం, తులసినగరం, బోయినవారిపాలెం, వృక్షనగర్, మహాత్మాజీపురం, వైఎస్సార్‌నగర్, సుబ్బారెడ్డిపాలెం, ఉప్పరపాలెం, మున్నవారిపాలెం, దరువాది కొత్తపాలెం గ్రామాల్లోని ప్రజలకు పూలసాగే ప్రధాన జీవనాధారం. ఇక్కడ ఒక్కో గ్రామంలో సుమారు 500 నుంచి 1,500 కుటుంబాలు దాకా ఉన్నాయి. ఒక్కో కుటుంబం కనిష్టంగా 10 సెంట్ల నుంచి గరిష్టంగా రెండు ఎకరాల్లో పూలను సాగు చేస్తున్నాయి. అన్ని గ్రామాల్లో కలిపి దాదాపు 1,500 నుంచి 2,500 ఎకరాల్లో పూల తోటలు సాగవుతున్నాయి. ఇక్కడి వారంతా తరతరాలుగా పూల సాగునే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఉదాహరణకు బేతపూడి గ్రామంలో 1,600 కుటుంబాలుండగా.. వారిలో దాదాపు 1,550 కుటుంబాలు పూల సాగుమీదే ఆధారపడి జీవిస్తున్నాయంటే.. ఈ ప్రాంతంలో పూలసాగుకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. 2004లో వైఎస్సార్‌ సీఎం అయ్యాక.. ఇచ్చిన ఉచిత విద్యుత్‌ పుణ్యమాని పూల సాగు ఒక్కసారిగా విస్తృతమైంది. తోటలే కాదు.. ఇళ్ల పరిసరాల్లో ఏ కొంచెం జాగా ఉన్నా పూల మొక్కలే దర్శనమిస్తాయి.
 

ఏ ఏ పూలు సాగు చేస్తారంటే..
ఇక్కడ మల్లె, జాజి, బంతి, గులాబి, నాటు గులాబి, ఐదు రకాల చేమంతులు, కనకాంబరాలు, కాగడాలు, లిల్లీ పూలను సాగుచేస్తున్నారు. వాటితో పాటు.. లైను ఆకు, తులసి ఆకు, మరువం ఆకులనూ విస్తృతంగా పండిస్తున్నారు. ఏ సీజన్‌లో పూసే పూలను ఆ సీజన్‌లో సాగుచేస్తారు. ఆ ఉత్పత్తులను వెదుళ్లపల్లిలోని పూల మార్కెట్‌కు తరలిస్తున్నారు. రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, కడప, నెల్లూరుతో పాటు.. హైదరాబాద్, చైన్నె నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి పూలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి పూల తోటల వల్ల దాదాపు 15,000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభిస్తోంది.  

ఆదాయం భళా
అన్ని ఖర్చులూ పోనూ ఒక్కో రైతు రోజుకు కనీసం రూ.500–600 వరకూ సంపాదిస్తున్నాడు. పండుగల సీజన్‌లో పూలకు భారీగా డిమాండ్‌ ఉండటంతో ఆదాయం మరింత పెరుగుతుంది. ధర లేనప్పుడు ఒక్కోసారి కోత కూలి కూడా రాని సందర్భాలున్నాయని రైతులు చెబుతున్నారు. ఇక ఇళ్ల పరిసరాల్లో జాజి, మల్లె, కనకాంబరాలను సాగుచేస్తున్నారు. వీటి ద్వారా రోజుకు కనీసం రూ.100 దాకా ఆదాయం వస్తుంది. పండుగల సమయాల్లో రోజుకు రూ.300–400 వరకూ మిగులుతాయని చెబుతున్నారు.  

ఇదే జీవనాధారం
మాకు ఊహ తెలిసినప్పటి నుంచి పూలతోటల సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. ఏ సీజన్‌లో ఏ పూలకు డిమాండ్‌ ఉంటుందో చూసుకుని దానికి తగ్గట్టుగా పూల తోటలను సాగు చేస్తున్నాం. ప్రస్తుతం బంతిపూలు, కనకాంబరాలు, లైన్‌ఆకు, విరజాజులు, గులాబీ, చేమంతి పూలను సాగుచేస్తున్నాం. తెల్లవారుజామున పూలతోటల్లోకి వెళ్లి పూలను కోసి.. వాడిపోకుండా జాగ్రత్తగా ప్యాక్‌ చేసి వేరే ప్రాంతాలకు పంపిస్తుంటాం. వ్యాపారులు వెదుళ్లపాల్లి మార్కెట్‌కు వచ్చి పూలను కొనుగోలు చేస్తారు.  
 – కుంచాల సుబ్రమణ్యంరెడ్డి, వెదుళ్లపల్లి కొత్తపాలెం  

వసతులు కల్పించాలి  
ఏడాది పొడవునా ఏ సీజన్‌లో పూసే పూలను ఆ సీజన్‌లో సాగుచేసి.. వాటిని వెదుళ్లపల్లి మార్కెట్‌కు తరలించి.. అక్కడికి వచ్చే వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది మంది మార్కెట్‌కు వస్తుంటారు. మార్కెట్‌లో అటు రైతులు, ఇటు వ్యాపారులు, చిరు వ్యాపారులకు కనీస వసతుల్లేవు. ప్రభుత్వం స్పందించి ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పిస్తే.. ఉపయోగకరంగా ఉంటుంది.  
– పుట్టా శ్రీనివాసరెడ్డి, బేతపూడి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement