
ఫుట్‌బాల్ కోర్టులో ఫుడ్‌కోర్టా..?
సీపీ నిర్ణయంపై క్రీడాకారుల ఆవేదన
స్టేడియం భద్రత ఇక ప్రశ్నార్థకం!
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఇటీవల ప్రారంభించిన మిడ్‌నైట్ ఫుడ్‌కోర్టు.. స్టేడియం మనుగడనే ప్రశ్నిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున రెండింటి వరకు నగరవాసులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసిన దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. అసలు ఫుట్‌బాల్ కోర్టులో ఫుడ్‌కోర్టు పెట్టడం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తుంటే.. అర్ధరాత్రి వేళ నేరగాళ్లు, తీవ్రవాదులు దర్జాగా స్టేడియంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కొంతమంది పోలీసులే చెబుతున్నారు. దీంతో సరికొత్త రాజధానిలో అత్యంత కీలకమైన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నారుు.
విజయవాడ స్పోర్ట్స్ : పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇటీవలి కాలంలో నగరవాసులహితం కోరి వినూత్న నిర్ణయూలతో అటు జనాన్ని, ఇటు పాలకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీ అరుుపోయూరంటే అతిశయోక్తి కాదు. కాబోయే రాజధాని ప్రాంత పరిరక్షణకు, నేరగాళ్లకు బ్రేకులు వేసేందుకు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ మొదలుపెట్టి సిటీలో పోలీసుమార్క్ డామినేషన్‌ను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చినా పండుగల సీజన్‌లో నేరాలు జరగకుండా అనధికారికంగానైనా ఈ ఆపరేషన్‌తో మంచి ఫలి తాలే వచ్చాయంటూ పోలీసు బాస్‌కు కితాబులొచ్చారుు. ఈ విషయూన్ని పక్కన పెడితే..
తాజాగా క్రీడాకారులు దేవాలయంగా భావించే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంపై ఆయన తీసుకునే కొన్ని నిర్ణయూలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారుు. రాత్రిపూట జనజీవనాన్ని అడ్డుకోవటానికి తాము డామినేషన్ ప్రదర్శించడం లేదని, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తమ ఇలాకాలో జనం కోరింది కోరినట్టు ఆరగించేందుకు చక్కటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మెట్రో కల్చర్‌లో భాగంగానే ఓపెన్ మిడ్‌నైట్ కోర్టు పెట్టాలన్న ఆలోచన రావడమే కాకుండా.. చక్కటి పాత పాటల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఫుట్‌బాల్ కోర్టులో ‘మిడ్‌నైట్ ఫుడ్‌కోర్టు’ను ప్రారంభించేశారు. సెకండ్ షో సినిమా చూసుకుని ఇంటికి వెళ్తూ వేడి వేడి బిర్యానీలో రెండు లెగ్ పీసులు పట్టుబట్టే అవకాశం ఓపెన్‌గా, అధికారికంగా కల్పించినందుకు పోలీస్ బాస్‌ను అంతా తెగ పొగిడేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే.. మరోవైపు అనేక ప్రశ్నలు..
క్రీడాకారుల ప్రశ్నలివీ..
ఈ ఫుడ్‌కోర్టును ఏకంగా ఫుట్‌బాల్ కోర్టులో ఏర్పాటు చేయడంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. ‘ఇదోదే ఫుట్‌బాల్ కోర్టే కదా..’ అనే చులకన భావం స్టేడియం కస్టోడియన్లకు కలగడం తమను బాధిస్తోందని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిత్యం స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే డ్రెరుునేజీ మురుగునీరుకు మట్టిగుట్టలు అడ్డుపెట్టుకుని ఆడుకునే ఫుట్‌బాల్ క్రీడాకారులు మిడ్‌నైట్ ఫుడ్‌కోర్టుతో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులపై ఆందోళన చెందుతున్నారు. తెల్లారేసరికి ఫుడ్‌కోర్టు పెట్టిన ఆనవాళ్లు లేకుండా రోజూ శానిటేషన్ కచ్చితంగా నిర్వహిస్తామని చెబుతున్న మునిసిపల్ కమిషనర్ బదిలీ కాకుండా ఇక్కడే స్థిరంగా ఉంటారా? అని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. స్టేడియంలో దుర్గంధం వెదజల్లుతున్న బాత్‌రూమ్‌లను పట్టించుకోని శానిటేషన్ అధికారులు ఫుడ్‌కోర్టు విషయంలో ఎలా స్పందిస్తారంటున్నారు.
చీకటి కార్యకలాపాలు జరగవన్న భరోసా ఉందా..?
ఫుడ్‌కోర్టు పుణ్యమా అని అధికారికంగానే అర్ధరాత్రి స్టేడియంలోకి ప్రవేశించే వెసులుబాటు కల్పించినపుడు చీకటి కార్యకలాపాలు జరగవని గ్యారెంటీ ఏమిటన్నది క్రీడాకారుల మరో ప్రశ్న. రాత్రి రెండు గంటల వరకు ఫుడ్‌కోర్టుకు అనుమతి ఉన్నపుడు మందుబాబులు గ్యాలరీలోకి వెళ్లి కుర్చుంటామంటే అడ్డు చెప్పేదెవరు? ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారంటున్నారు. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్టేడియం గోడలకు రంధ్రాలు పెట్టి లోపల ఉన్న క్రీడా సంఘాల కార్యాలయాల్లో ఏసీలు, విలువైన వస్తువులు, ఇతర సామగ్రిని అందినకాడికి దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో కీలకమైన ప్రధాన స్టేడియాన్ని సీసీ కెమెరాల భద్రతల నడుమ చూడాల్సిన అధికారులు మిడ్‌నైట్ ఫుడ్‌కోర్టులకు నిలయం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టేడియం భద్రత ఎంత?
కాబోయే రాజధాని నగరం అనేక కీలక కార్యక్రమాలకు వేదిక కానుంది. ఇలాంటి సమయంలో మిడ్‌నైట్ ఫుడ్‌కోర్టులకు తరలివచ్చే అపరిచితులతో స్టేడియం భద్రతకు ముప్పుతప్పదనే విషయం పోలీసు బాస్‌కు తెలియంది కాదు గానీ, ఫుడ్‌కోర్టు ఏర్పాటు వెనుక దాగి ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఫుడ్‌కోర్టుకు వచ్చినోళ్లు కేవలం తినేసి వెళ్లిపోతారనుకుంటే పొరపాటే. రాత్రిపూట ఖాళీ ప్రదేశం దొరికిందని అక్కడే తిష్ట వేసే ప్రమాదం ఉంది. అసాంఘిక కార్యకలాపాలతో పాటు మలమూత్రాలు స్టేడియంలో విసర్జించి ఆ ప్రాంతాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇక.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు రెక్కీ జరుపుకోవటానికి అవకాశం కల్పించినట్టేనని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇలాంటి తోపుడు బళ్ల మిడ్‌నైట్ ఫుడ్‌కోర్టులు లేవు. అక్కడ కూడా మెట్రో కల్చర్‌కు అనుగుణంగా ఫుడ్‌కోర్టులు ఉన్నాయి. కానీ, ఏ క్రీడా మైదానాన్ని వీటికి వేదికగా మార్చలేదు.