
ఇదేం పోయే కాలమో..?!
ఆస్తి కోసం ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన తల్లిని, తమ్ముడి కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశాడు.
► ఆస్తి కోసం తల్లి,
► సోదరుడి కుటుంబాన్ని గెంటేసిన దుర్మార్గుడు
► న్యాయం కోసం ఇంటి ఎదుటే బాధితుల ధర్నా
► రంగంలోకి దిగిన పోలీసులు
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. భూమికి విలువ పెరిగాక మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. ఆస్తి కోసం అయిన వారే కాని వారవుతున్నారు. తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచిన తల్లిని, రక్తం పంచుకుపుట్టిన సోదరుడ్ని, అతని కుటుంబాన్ని ఇంటి పెద్దకుమారుడు నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. న్యాయం కోసం బాధితులు రోడ్డెక్కారు. అటుగా వెళ్తున్న వారందరూ చూసి ఇదేం పోయే కాలమో..? నంటూ పెదవి విరిచారు.
ధర్మవరం అర్బన్ : ఆస్తి కోసం ఓ వ్యక్తి కర్కశంగా ప్రవర్తించాడు. తన తల్లిని, తమ్ముడి కుటుంబాన్ని ఇంటి నుంచి గెంటేశాడు. రోడ్డునపడ్డ బాధితులు ఇంటి ఎదుటే ధర్నాకు దిగారు. చివరకు వీరి పంచాయితీ పోలీసుస్టేషన్‌కు చేరింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఓలేటి వరలక్ష్మమ్మ నివాసముంటోంది. ఆమెకు నలుగురు కుమారులు ఉన్నారు. వరలక్ష్మమ్మ తన పుట్టినింటివారు కానుకగా ఇంటిని ఆమె పేరున రాసిచ్చారు. ప్రస్తుతం ఆ ఇంట్లో వరలక్ష్మమ్మతోపాటు చిన్న కుమారుడు విజయ్‌కుమార్, అతని భార్య సుధామణి, కుమార్తెలు వర్షిత, బిందుశ్రీ ఉంటున్నారు. రెండో కుమారుడు శంకర్‌నారాయణశెట్టి, అతని భార్య సావిత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి తమను రౌడీలతో కొట్టించి ఇంటినుంచి బయటకు నెట్టేశారని బాధితురాలు వరలక్ష్మమ్మ వాపోయింది.
ఆమెతోపాటు చిన్నకుమారుడు, అతని భార్య, పిల్లలతోసహా శుక్రవారం ఉదయం 7.30 నుంచి ఇంటిముందు రోడ్డుపై బైఠాయించారు. చిన్న కుమారుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనను టీడీపీ నాయకులు రెండురోజుల క్రితం పిలిపించి కొట్టారని, మీ అమ్మ పేరున ఉన్న ఇంటిని అమ్మేసి మీ రెండో అన్నకు ఇవ్వాలని బెదిరించారని వాపోయాడు. ఉదయం కూడా టీడీపీకి చెందిన ఓ ఫ్యాక్షన్ నేత మనుషులు నలుగురు ఇంట్లోకి చొరబడి తమను కొట్టి బయటకు గెంటేశారన్నాడు. వరలక్ష్మమ్మ మాట్లాడుతూ తాను చనిపోయిన తర్వాత నలుగురు కుమారులూ ఇంటిని పంచుకునేలా వీలునామా రాశానని తెలిపింది. కుటుంబ సభ్యులంతా రోడ్డుపై ధర్నా చేయగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పట్టణ పోలీసులు జోక్యం చేసుకొని బాధితులతోపాటు, ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న రెండో కుమారుడు శంకర్‌నారాయణశెట్టిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.