కృష్ణానదిపై నాటు పడవలో విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బంది
సాక్షి, ఆత్మకూరు: అడవి సంపదపై అక్రమార్కుల కన్ను ఉంటుంది. వీలుదొరికితే కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కొన్నిసార్లు వారు ఎంతకైనా తెగిస్తుంటారు. వారితో అటవీ సిబ్బంది ఒట్టి చేతులతో పోరాడాల్సి ఉంటుంది. ఆయుధాలు లేకుండా విధులు నిర్వహించడం వారికి కొంత ఇబ్బందికరంగా మారింది. ఎర్రచందనం ఉన్న చోట మాత్రమే అటవీ సిబ్బందికి కొద్దిమేర ఆయుధాలు ఇస్తున్నారు. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యం దేశంలోనే అతిపెద్దది. దీనికి అంతర్జాతీయ పులి చర్మాల స్మగ్లర్లతో ప్రమాదం పొంచి ఉంది. వారి వేటను అడ్డుకునే అటవీ సిబ్బందిని చంపడానికి సైతం స్మగ్లర్లు వెనుకాడారు.
2004 సెప్టెంబర్ 11న కర్ణాటకలో విధులు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్‌ను గంధం చెక్కల స్మగ్లర్ వీరప్పన్ నరికి చంపాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ రోజును అటవీ అమరుల సంస్మరణ దినోత్సవంగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్ 11న అటవీ సిబ్బంది అమరులను స్మరించుకుంటూ సభలు,సమావేశాలు నిర్వహిస్తారు.
ప్రమాదాల అంచుల్లో నదిపై పహారా
ఆత్మకూరు అటవీ డివిజన్‌లో కృష్ణానది సంగమేశ్వరం దగ్గర ప్రారంభమై శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుగా ప్రవహిస్తుంటుంది. ఈ నదినే స్మగ్లర్లు వనరుగా ఉపయోగించుకుని అటవీ సంపద దోస్తుంటారు. వారిని నిరోధించడం కోసం అటవీ శాఖ రివర్ పార్టీ పేరుతో నాటు పడవలపై నదిపై పహారా ఏర్పాట్లు చేసింది. ప్రమాదకరమైన ఈ విధులను అటవీ సిబ్బంది ధైర్యంగా
నిర్వహిస్తున్నారు.
చాలీచాలని జీతం..
అడవిలోనే 24 గంటలు ఉండే అటవీ సిబ్బందికి జీతం మాత్రం అరకొరగా ఇస్తున్నారు. ఒక్కో బేస్ క్యాంపులో కనీసం ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లు ఉన్నారు. వీరికి భోజన సౌకర్యం కల్నిస్తూ రూ. 8వేల లోపు జీతం ఇస్తున్నారు. వారంలో ఒక రోజు మాత్రమే సెలవు ఇస్తారు. కఠినతరమైన విధులైనప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. పై అధికారి దయాదాక్షిణ్యాలపై వారి జీవితం ఆధారపడి ఉంటుంది.
అటవీ సంరక్షణలో సైతం వారు సగం
అటవీ శాఖలో క్రమేపి మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో కార్యాలయ విధుల్లో మాత్రమే ఉన్న మహిళలు ఇప్పుడు ఏబీవో స్థాయి నుంచి డీఎఫ్‌ఓల వరకు అన్ని స్థాయిల్లో పని చేస్తున్నారు. ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ వారు విధులు నిర్వహించడం కత్తి మీద సామే. ఇటీవల ఎఫ్‌ఎస్‌ఓ కావేరి భయపడకుండా వన్యప్రాణి వధ కేసుల్లో నిందితుడైన ఒక వ్యక్తిని పట్టుకుని అటవీశాఖ హెడ్ క్వార్టర్‌కు తరలించ గలిగింది.
గురుతర బాధ్యత మాది
అడవులు లేకపోతే మనిషి ఉనికే లేదు. మేము ఆ అటవీని సంరంక్షించే గురుతర బాధ్యత నిర్వహిస్తున్నాము. అయితే, చేతిలో ఆయుధాలు ఉంటే ఎలాంటి భయం లేకుండా విధులు నిర్వహించొచ్చు.
–నాగునాయక్, ఎఫ్‌ఎస్‌ఓ
అమరులకు నివాళులర్పిస్తాం
అటవీ సంరక్షణలో ప్రాణాలర్పించిన ఉద్యోగులకు ప్రతి ఏటా నివాళు లర్పిస్తాం. ఇప్పటికీ అటవీ సిబ్బందికి భద్రత లేదు. క్రూర జంతువుల బారినుంచి తప్పించుకునేందుకు రక్షణ ఉపకరణాలను ప్రభుత్వం అందించాలి.
–వెంకటరమణ గౌడ్, కోశాధికారి, ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌ఎస్‌ఓల సంఘం
Comments
Please login to add a commentAdd a comment