సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెదబాబు డైరెక్షన్‌లో చినబాబు యాక్షన్‌తో లక్షలాది ఓట్ల తొలగింపునకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ప్రతీ జిల్లాలో 90 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు చినబాబు బృందం స్కెచ్ వేసింది. ఇప్పుడా పథకం వికటించడంతో వారు ఎదురుదాడికి దిగడమే కాకుండా వైఎస్‌ఆర్‌సీపీయే ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఇది దొంగే ‘దొంగా దొంగా’ అన్నట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఏడాది నవంబరు నుంచి ఇప్పటివరకు ఓట్లు తొలగించాలంటూ సంబంధిత ఓటర్లతో సంబంధం లేకుండా వారి పేర్లతోనే చినబాబు బృందాలు ఆన్‌లైన్ ఫాం–7ను సమర్పించాయి. ఈ విధంగా ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపునకు 8,73,500 దరఖాస్తులు వచ్చాయి. ఇంత పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు రావడంతో ఎన్నికల అధికారులకు సందేహం వచ్చింది. ఇది సహజంగా లేదని గుర్తించి క్షేత్రస్థాయి తనిఖీలకు ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అసలు గుట్టురట్టయింది.
నిర్ధారించుకున్న తర్వాతే..
ఓట్ల తొలగింపునకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతగానీ తొలగించరాదని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తనిఖీలు నిర్వహించి 1.48 లక్షల ఓట్లను తొలగించగా.. మరో 30 వేలకు పైగా దరఖాస్తుల్లో వాస్తవంలేదని అధికారులు తిరస్కరించారు. మరో 24 వేలకు పైగా వెరిఫికేషన్‌లో ఉన్నాయి. మిగిలిన 6.70 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అన్నింటినీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసేవరకూ తొలగించబోమని అధికారులు స్పష్టంచేశారు. అయితే, ఎన్నికల నాటికి తనిఖీలు పూర్తిచేసి తొలగించడమా లేదా అన్నది చేయాలి. దరఖాస్తు తిరస్కరించినట్లయితే వారికి ఓటు హక్కు వస్తుంది. అలా కాకుండా పెండింగ్‌లో ఉంటే ఓటు హక్కు ఉండదనే సందేహాలు ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం తర్వగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
కార్యాలయం నుంచే..
ఓట్ల తొలగింపు వ్యవహారం ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో బయటపడింది. సాక్షాత్తూ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి కార్యాలయం నుంచి టీడీపీ కార్యకర్త పేరుతో ఆన్‌లైన్‌లో రొంపిచర్ల మండలానికి చెందిన కోటేశ్వరరావు అనే వ్యక్తి ఓటు తొలగించాలంటూ ఫాం–7 సమర్పించారు. దీనిపై అధికారులు.. మీ ఓటుఎందుకు తొలగించరాదో చెప్పాలంటూ కోటేశ్వరరావుకు నోటీసు జారీచేశారు. దీంతో కోటేశ్వరరావు తన ఓటును ఎందుకు తొలగిస్తారంటూ అధికారులను నిలదీశాడు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఫలానా వ్యక్తి మీ ఓటు తొలగించాలంటూ ఫాం–7 సమర్పించారని కోటేశ్వరరావుకు చెప్పారు. దీనిపై కోటేశ్వరరావు సదరు టీడీపీ కార్యకర్త దగ్గరకు వెళ్లి ఆరా తీశాడు. అయితే, ఆ టీడీపీ కార్యకర్త తానెలాంటి దరఖాస్తు సమర్పించలేదని చెప్పాడు. చివరికి అతను సమర్పించలేదని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన తరువాతే అధికారులు కోటేశ్వరరావు ఓటును తొలగించకుండా జాబితాలో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment