సాక్షి, నెట్‌వర్క్: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అన్ని రకాల అక్రమాలకు తెరలేపారు. ఈ ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి అవినీతికి ఆలవాలంగా మారిన టీడీపీ సర్కార్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు సాగిస్తోంది. ఇంతటితో ఆగక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులయితే వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల తొలగింపు కార్యక్రమాన్ని టీడీపీ వేగవంతం చేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని ఈ దురాగతానికి పాల్పడుతోంది. ఫామ్–7 ద్వారా పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ మద్దతుదార్ల ఓట్లు తొలగిస్తోంది. ఓటరు తన ఓటును తొలగించాలంటూ తానే ఫామ్–7 దరఖాస్తును ఇచ్చినట్లు బోగస్ సంతకాలతో దరఖాస్తులు నింపి ఎన్నికల అధికారులకు కుప్పలుతెప్పలుగా టీడీపీ నేతలు సమర్పించారు.
పథకం ప్రకారమే.. ఓట్ల తొలగింపునకు కుట్ర
పథకం ప్రకారం.. ఓట్లు తొలగించాలంటూ ఫామ్–7 దరఖాస్తులు ఇచ్చే బాధ్యతలను నియోజకవర్గాలవారీగా అధికార పార్టీ నేతలకు టీడీపీ అప్పగించింది. అధికార పార్టీ అక్రమంగా ఓట్ల తొలగింపు కోసం ఫామ్–7 దరఖాస్తులను ఇవ్వడాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ నేతలు అప్రమత్తమయ్యారు. కొద్దిరోజులుగా ఎన్నికల అధికారుల కార్యాలయాల వద్దే ఉండి వెరిఫికేషన్ కోసం పట్టుబట్టారు. కొన్ని దరఖాస్తులు వైఎస్సార్‌సీపీ నేతల పేరునే ఇచ్చి ఉండడాన్ని గమనించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌స్టేషన్‌లో కేసులు సైతం నమోదు చేయించారు. విచారణను వేగవంతం చేయాలని పట్టుబడుతున్నా అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు, పోలీసులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. చేస్తాం, చూస్తామంటూ దాటవేస్తున్నారు. పైగా ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.
సోమవారం ఒంగోలు తహశీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాన్ని పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, ఆయన అనుచరులపై పోలీసులు దౌర్జన్యం చేశారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఫామ్–7 దరఖాస్తుల అక్రమాలపై విచారణ సరిగా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఓట్లు తొలగించాలని మొత్తం 53,450 దరఖాస్తులు అందినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాలవారీగా.. దర్శిలో 2,500కు పైగా, అద్దంకిలో 5,640, చీరాలలో 11 వేలు, గిద్దలూరులో 2 వేలు, కందుకూరులో 10 వేలు, కొండెపిలో 2 వేలు, మార్కాపురంలో 7 వేలు, సంతనూతలపాడులో 4,423, ఒంగోలులో 3 వేలు, పర్చూరులో 5,201, కనిగిరిలో 686 దరఖాస్తులు అధికారులకు అందాయి.
ఓట్లు తొలగించాలంటూ ఓటర్ల పేరిటే అక్రమ దరఖాస్తులు
శ్రీకాకుళం జిల్లాలో ఓట్లు తొలగించాలని ఆన్‌లైన్‌లో ఫామ్–7 దాఖలు చేసిన వారిపై పోలీసులు కేసులకే పరిమితమవుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదులపై మౌనం పాటిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఓట్ల తొలగింపు కోసం 28 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఆన్‌లైన్‌లో వచ్చినవే 24 వేలు. తప్పుడు దరఖాస్తులపై జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే... కురుపాంలో 3,349, సాలూరులో 3,643, చీపురుపల్లిలో 7,296, గజపతినగరంలో 4,845, విజయనగరంలో 698, నెల్లిమర్లలో 3,800, బొబ్బిలిలో 8,734, పార్వతీపురంలో 422, ఎస్.కోటలో 7,534 దరఖాస్తులు ఓట్లు తొలగించాలని ఎన్నికల అధికారులకు అందాయి.
విశాఖ జిల్లాలో ఈ ఏడాది జనవరి 23, 24 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కొత్త ఓటర్ల నమోదు కోసం 13,999 దరఖాస్తులు, తొలగింపుల కోసం 1955 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అలాంటిది జనవరి 25 నుంచి మార్చి 1 వరకు జిల్లాలో కొత్త ఓట్ల నమోదు కోసం ఏకంగా 2,08,700 దరఖాస్తులందాయి. ఇక తొలగింపుల కోసం ఏకంగా 74,848 దరఖాస్తులందాయి. కేవలం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు ఆన్‌లైన్‌లో ఫామ్–7 ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ల ప్రమేయం లేకుండా ఓట్ల తొలగింపునకు ఆన్‌లైన్‌లో నకిలీ అభ్యర్థనలు వెళ్తున్నాయి. గత వారం రోజులుగా ప్రతిచోటా ఈ వ్యవహారం బయటపడుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల ఓట్లు తొలగించేందుకు అజ్ఞాత వ్యక్తుల ముసుగులో టీడీపీ నేతలు యత్నించారు.
మీసేవ, ఇంటర్నెట్ కేంద్రాలను ఆధారంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ బూత్ కన్వీనర్ల పేరుతో వైఎస్సార్‌సీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదులతో అప్రమత్తమైన అధికారులు మీసేవా కేంద్రాలు, పలువురు వ్యక్తులపై పోలీసుస్టేషన్‌లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ మొత్తం బాగోతం వెనక ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ వంటి సంస్థలు ఉన్నాయన్నది తెలియగానే ఎప్పుడు ఎవరి ఓటు పోతుందోనన్న ఆందోళన రేకెత్తుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫామ్–7 ద్వారా ఓట్లు తొలగించాలని 55,062 దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన పార్టీలకు రెండేసి సెట్లు చొప్పున ఓటర్ల జాబితాను గతంలో అందించారు.
అప్పటి నుంచే అధికార పార్టీ తనకు దక్కని ఓట్లపై కన్నేసి తొలగింపు పర్వానికి తెరలేపింది. ఓటర్ల జాబితాలను పక్కనపెట్టుకుని అందులో అధికార పార్టీకి కచ్చితంగా ఓటు వేయరని భావించే వారిని లక్ష్యంగా చేసుకుంది. కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార టీడీపీ నేతలు కుట్రపన్నారు. అందులో భాగంగా ఓటర్ల పేరిటే తమ ఓట్లను తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో 62 వేల నకిలీ దరఖాస్తులు సమర్పించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియలో టీడీపీ కుట్ర వెలుగుచూడటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఫామ్–7 దరఖాస్తులు చేసిన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా వేలాది దరఖాస్తులు వస్తే కేవలం 15 మందిపై మాత్రమే కేసులు నమోదు చేశారు. అందులో మైలవరంలో 4, జగ్గయ్యపేటలో 3, మచిలీపట్నంలో 3, అవనిగడ్డలో 3, పెనమలూరులో 1, విజయవాడ తూర్పులో 1 కేసు నమోదు చేశారు.
ఒక్క గుంటూరు జిల్లాలోనే 1,09,079 దరఖాస్తులు
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై గుంటూరు జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఫిబ్రవరి 28 నాటికి ఓటర్ల తొలగింపు కోసం 1,09,079 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో అనుమానాస్పద ఓటర్లు, డూప్లికేట్ ఓట్ల పేరుతో భారీగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓట్లు తొలగించాలని 35 వేలకు పైగా ఫామ్–7 దరఖాస్తులు వచ్చాయి. వీటితోపాటు అనుమానాస్పద ఓటర్లు, డూప్లికేట్ పేర్లతో 65 వేలకు పైగా ఓటర్లను తొలగించారు. ఇదంతా ఏపీ ఐటీ గ్రిడ్ సంస్థ చేసిందని స్పష్టమవుతోంది. ఫామ్–7 దరఖాస్తులను విచ్చలవిడిగా అప్‌లోడ్ చేయిస్తూ వైఎస్సార్‌సీపీ ఓట్లు, ఉద్యోగుల ఓట్లకు భారీగా కోత పెట్టడానికి టీడీపీ పథకాన్ని రచించింది. ఈ నెల 3 మధ్యాహ్నం నాటికి జిల్లాలో 65,478 ఓట్లను తొలగించాలని దరఖాస్తులు రావడం దీనికి నిదర్శనం. ఇందులో 90 శాతం దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారానే రావడం గమనార్హం. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 9,996 దరఖాస్తులు రాగా.. 4,959ను అధికారులు ఆమోదించారు. ఆదోని, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లోనూ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై జిల్లాలో ఇప్పటివరకు 8 క్రిమినల్ కేసులను నమోదు చేశారు. వైఎస్సార్ జిల్లాలో ఓడిపోతామన్న భయం వెంటాడుతుండటంతో టీడీపీ.. వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపునకు దొంగ దరఖాస్తులను అందజేస్తోంది. జిల్లాలో చాపాడు మండలం కుచ్చుపాప గ్రామానికి చెందిన ఎం.లక్షుమ్మ కొద్దికాలం క్రితం మృతి చెందింది. గ్రామానికి చెందిన 19 ఓట్లు తొలగించాలని లక్షుమ్మ పేరుతో టీడీపీ నేతలు దరఖాస్తు చేయడం గమనార్హం. పులివెందులలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఓటును తొలగించాలని దరఖాస్తు చేసిన వైనం విస్మయం కలిగించింది.
జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సుమారు 40 వేల నుంచి 50 వేల ఓట్ల తొలగింపునకు టీడీపీ నేతలు పథక రచన చేశారు. చిత్తూరు జిల్లాలో ఫిబ్రవరి 28 వరకు ఓట్లు తొలగించడానికి ఆన్‌లైన్ ద్వారా 89,547 దరఖాస్తులు అందాయి. అందులో ఇప్పటివరకు 11,576 మందిని మాత్రమే అధికారులు విచారించారు. నియోజకవర్గాలవారీగా తంబళ్లపల్లెలో 8,308, పీలేరులో 5,345, మదనపల్లెలో 2,709, పుంగనూరులో 6,825, చంద్రగిరిలో 20,128, తిరుపతిలో 3,850, శ్రీకాళహస్తిలో 4,385, సత్యవేడులో 5,916, నగరిలో 3,686, జీడీ నెల్లూరులో 8025, చిత్తూరులో 4,600, పూతలపట్టులో 5,630, పలమనేరులో 6,857, కుప్పంలో 3,283 దరఖాస్తులు వచ్చాయి.
అనంతపురం జిల్లాలో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు టీడీపీ భారీ కుట్రకు తెరతీసింది. దీనికోసం సర్వే పేరిట జిల్లాలో కొన్ని బృందాలను రంగంలోకి దింపారు. ఇవి ఆన్‌లైన్‌లో ఫామ్–7 పేరుతో ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశాయి. జిల్లావ్యాప్తంగా ఫామ్–7 కింద 79,819 దరఖాస్తులు వస్తే అందులో 22,202 దరఖాస్తుల పరిశీలనకు అధికారులు సిఫార్సు చేశారు. ఇంతలో ఈ కుట్రను పసిగట్టి వైఎస్సార్‌సీపీ నేతలు సాక్ష్యాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తిగా కుట్ర ఉందని తేలడం, ఎన్నికల కమిషన్‌ను కలిసేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధం కావడంతో సందిగ్ధంలో పడ్డారు. తక్కిన 57,617 దరఖాస్తులను విచారణకు పంపకుండా తాత్కాలికంగా నిలిపేశారు. గతేడాది జిల్లావ్యాప్తంగా 1,01,772 ఓట్లను అధికారులు తొలగించారు. ఇందులో అత్యధికంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 60 వేల ఓట్లు ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లు తొలగింపునకు ఆన్‌లైన్‌లో దాదాపు 25 వేల దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది. ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, కావలి నియోజకవర్గాల్లో అధికంగా అక్రమ దరఖాస్తులు నమోదు చేసినట్లు సమాచారం. ఏపీలో ఓటర్ల డేటా దుర్వినియోగం చేస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకుడు డాకవరం అశోక్ అల్లూరు వాసే కావడంతో జిల్లాలో కలకలం రేగింది.
నా పేరుతో 29 దరఖాస్తులు వచ్చాయట
నా పేరుతో 29 మంది ఓట్లను తొలగించాలని దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. కేవలం నా ఆధార్ కార్డు నంబర్ తెలుసుకున్న టీడీపీ నేతలు ఇలా నా పేరుతో దరఖాస్తులు నింపి గొడవలు సృష్టిస్తున్నారు. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయిలో విచారించి కఠిన చర్యలు తీసుకోవాలి.
– బి.వెంకటరామిరెడ్డి, హజరత్‌గూడెం, కంభం మండలం
మా ఇంట్లో మూడు ఓట్లు తొలగించారు
నేను గిద్దలూరులో నివాసం ఉంటున్నాను. నా ఓటుతోపాటు, నాభార్య, కోడలి ఓట్లను తొలగించారు. కొంత కాలంగా ‘సాక్షి’ పత్రిక చదువుతున్నాను. అందుకే మా ఓట్లను తొలగించారని చెబుతున్నారు. తిరిగి ఓటును చేర్పించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను.
– పగిడి వెంకటేశ్వర్లు, మాజీ సైనికుడు, గిద్దలూరు
టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది.
అనంతపురం 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్, వైఎస్సార్‌సీపీ నేత టీవీ చంద్రమోహన్‌రెడ్డి కుమారుడు టీవీ సాయి చరణ్ రెడ్డి ఓటును తొలగించాలని టీడీపీ నేతలు దరఖాస్తు చేశారు. దీనిపై చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment