సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకే ఉద్యోగాలను కల్పించాలని సీఎం వైఎస్ జగన్ తీసుకొచ్చిన చట్టానికి అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఈ కార్పొరేషన్ చైర్మన్‌ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియమిస్తుంది.
చైర్మన్‌తో పాటు స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్ విభాగం కార్యదర్శులు, ఎసీఈఈడీఏపీ సీఈవో, ఎంప్లాయిమెంట్, శిక్షణ, సాంకేతిక విద్య, కళాశాల విద్య శాఖల కమిషనర్ లేదా డైరెక్టర్లతో పాటు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు జీఎంఆర్, డాక్టర్ రెడ్డీస్, మైఖెల్ సుసాన్ డెల్ ఫౌండేషన్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లకు చెందిన వ్యక్తులు భాగస్వామ్య డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఈ రంగంలో అనుభవం ఉన్న విశాఖ హెచ్‌పీసీఎల్‌కు చెందిన స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ సీఈవో, కార్యదర్శి, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఆర్‌సీఎం రెడ్డిని ప్రభుత్వం నామినేట్ చేసింది.
ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌గా చల్లా బాధ్యతల స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్‌గా చల్లా మధుసూదన్ రెడ్డి బుధవారం ఆ సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా సంబంధాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని, రాష్ట్ర మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, వెలంపల్లి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్‌తో పాటు ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, మల్లాది విష్ణు, కాసు మహేష్ రెడ్డి, ముస్తఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రక్షణనిధి, మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదతరులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment