‘స్కిల్డ్‌’ క్రిమినల్‌ బాబే | CM Jagan On Chandrababu In AP Assembly Budget Sessions 2023 | Sakshi
Sakshi News home page

‘స్కిల్డ్‌’ క్రిమినల్‌ బాబే

Published Tue, Mar 21 2023 2:02 AM | Last Updated on Tue, Mar 21 2023 2:07 AM

CM Jagan On Chandrababu In AP Assembly Budget Sessions 2023 - Sakshi

శాసనసభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బటన్‌ నొక్కితే...
నేను బటన్‌ నొక్కితే డీబీటీ ద్వారా నా అక్కచెల్లెమ్మలు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు బటన్‌ నొక్కగానే ప్రభుత్వ ఖాతా నుంచి అటూ ఇటు తిరిగి ఆయన ఖాతాలోకి డబ్బులు వచ్చాయి.

ఇంతకంటే ఇంకేం కావాలి?
స్కిల్‌ స్కామ్‌లో నిధుల విడుదలపై కొందరు ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేసినా వెంటనే డబ్బులివ్వా­లని అప్పటి ప్రిన్సిపల్‌ ఫైనాన్స్‌ సెక్రటరీని ఆదేశిస్తూ చంద్రబాబు నోట్‌ ఫైల్‌లో పేర్కొన్నారు. ఇంకో నోట్‌ ఫైల్‌లో సీఎం చంద్రబాబు చెప్పారు కాబట్టి నిధులు నేరుగా విడుదల చేశామని చీఫ్‌ ఫైనాన్స్‌ సెక్రటరీ రాశారు. ఈ స్కామ్‌లో ఇన్ని సాక్షాధారాలను నేను చూపిస్తున్నా. ఈ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అనడానికి ఇంతకన్నా ఏం కావాలి...?
– శాసనసభలో సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే. స్కిల్డ్‌ క్రిమినల్‌ చంద్రబాబు చేసిన స్కామ్‌ ఇది. ఉద్యోగులు, విద్యార్థులకు స్కిల్‌ ట్రైనింగ్‌ పేరుతో టీడీపీ ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడింది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ వేదికగా ప్రజలకు వాస్తవాలను బహిర్గతం చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ దొంగల ముఠాగా ఏర్పడి లోపాయికారీ ఒప్పందంతో రూ.371 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా కాజేశారని ఆధారాలతో సహా వెల్లడించారు.

ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఎందుకు నోరు మెదపలేదు..? దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. “సీమెన్స్‌ కంపెనీకే తెలియకుండా ఆ సంస్థ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సృష్టించింది. కేబినెట్‌ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకుంది. చంద్రబాబు అవినీతి స్కిల్‌ ఇదీ’ అని మండిపడ్డారు. “కనీసం డీపీఆర్‌ లేదు. రూల్స్‌ బేఖాతర్‌.. ప్రొసీజర్స్‌ బేఖాతర్‌.. పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ బేఖాతర్‌. చంద్రబాబు చెప్పిందే వేదం’ అని దుయ్యబట్టారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై శాసనసభలో సోమవారం చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ఈ స్కామ్‌ జరిగిన తీరును వివరిస్తూ జీవోలు, ఎంవోయూలను సభలో స్లైడ్స్‌ ద్వారా ప్రదర్శిస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి  జగన్‌ ప్రసంగం వివరాలు ఇవీ..

“షెల్‌’ డబ్బులు బాబు ఇంటికి
రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్‌ ఇది. స్కిల్లింగ్‌ పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్‌. వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని ఆ పది కూడా దోచుకున్న మాదిరిగా ఈ వ్యవహారం ఉంది. అమెరికా, యూరప్‌లో లాటరీ తగిలింది.. 10 మిలియన్‌ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి. అర్జెంట్‌గా రూ.10 లక్షలు కట్టండి.. ఆ తరువాత 10 వేల మిలియన్‌ డాలర్లు వస్తాయని చెబుతుంటారు.

అదే మాదిరిగా సీమెన్స్‌ పేరుతో స్కామ్‌ జరిగింది. ఇలాంటి గొప్ప స్కామ్‌ను నడిపిన వ్యక్తి నారా చంద్రబాబే. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని మాయం చేశారు. ఈ డబ్బును షెల్‌ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్‌ చేసి మళ్లీ చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు. స్కిల్డ్‌ క్రిమినల్‌ చేసిన స్కామ్‌ ఇది. న్యాయ పరిభాషలో పార్టనర్స్‌ ఆఫ్‌ క్రైమ్‌ ప్రొసీజర్స్‌ లాంటిదీ ఈ స్కామ్‌. 

కేబినెట్‌ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం
కేబినెట్లో ఒకటి చెప్పి ఆ ప్రకారం జీవో జారీ చేశారు. వాటికి విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత మరో ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేశారు. ప్రజాధనాన్ని దోచేయడంలో చంద్రబాబు చాతుర్యం చూడాలంటే స్కిల్‌ స్కామ్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు.

విదేశాల్లో షెల్‌ కంపెనీలకు ఈ స్కామ్‌ పాకింది. ఆ తరువాత మళ్లీ వివిధ రూపాల్లో మన దేశానికి వచ్చింది. ఈ స్కామ్‌పై జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఈడీ, సీఐడీ.. అన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. 

ముందుగానే ఊహించి..
చేయని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఎలా చూపించాలి..? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి..? చట్టానికి దొరక్కుండా ఏ ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి..? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి..? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి..? ఇవన్నీ ముందుగానే ఊహించుకుని రూపకల్పన చేశారు.

ఒక క్రిమినల్‌ మాత్రమే ఇలా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్‌ ఆయన. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ స్కిల్‌ స్కామ్‌ ఊపిరి పోసుకుంది. ఇందుకోసం తనకు కావాల్సిన మనుషులను చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లోకి తీసుకొచ్చారు.

ఓ ప్రైవేట్‌ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్‌ ఇస్తుందా?
సీమెన్స్‌ కంపెనీలో ఓ ఉన్నతోద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడి ద్వారా దోపిడీకి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం,  సీమెన్స్‌ కంపెనీ 90 శాతం భరిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్‌ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్‌ ఇస్తుందా..? పోనీ చంద్రబాబు ముఖాన్ని చూసి ఇస్తారా...? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది.

ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు...? ప్రభుత్వం వాటా ఎంత? మిగిలిన వారి వాటా ఎంత..? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది..? మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు..? ప్రతి స్ధాయిలో ఖర్చు ఎంత ఉంటుంది..? ఏ రకంగా నిధులు వస్తాయి..? టార్గెట్‌ ఎప్పటికి పూర్తవుతుంది..? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది..? ఇలా అన్ని కోణాల్లోనూ ఆధ్యయనం చేసి అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలను డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టులోకి తేవాలి.

ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను సర్టిఫైడ్‌ చేయాలి. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్‌ కూడా తయారు చేయలేదు. ముందస్తుగానే ఆ కంపెనీలో లాలూచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు రూపొందించిన డీపీఆర్‌ను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ఒక నోట్‌ పెట్టించారు. కనీసం టెండర్‌ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. చంద్రబాబుకు మాత్రమే ఇటువంటిది సాధ్యం. 

నిబంధనలకు పూర్తి విరుద్ధంగా..
గత ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి, ఆపై స్ధాయిలో చూసీ చూడనట్లు వదిలేశారు. ఏకంగా స్పెషల్‌ ఐటెమ్‌గా కేబినెట్‌లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్‌లోకి రావడం, వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి.

అధ్యయనం చేయని, ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఇలా కేబినెట్‌కు నోట్‌ పెట్టడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు పాలనలో రూల్స్‌ బేఖాతర్, ప్రొసీజర్స్‌ బేఖాతర్, ఆయన చెప్పిందే వేదం అన్నట్లు నడిపించారు. 

ఎల్లో మీడియా రాయదు.. దత్తపుత్రుడు ప్రశ్నించడు
ఈ స్కామ్‌.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తవ్వింది కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది బయటకు పొక్కింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు దత్తపుత్రుడు కూడా అడగలేదు.

ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తుంటే వీళ్లంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ).. ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు, ఎవరూ రాయరు, ఎవరూ చూపరు, ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. 

గ్రాంట్‌ అనే పదమే లేకుండా ఒప్పందం
రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అని, 5 టెక్నికల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్స్‌ కూడా ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారు. ఒక్కో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90 శాతం ఖర్చును సీమెన్స్, డిజైన్‌టెక్‌ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద అందిస్తుందని, మిగిలిన 10 శాతం అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పారు.

ప్రాజెక్టు వ్యయంలో పది శాతం, పన్నులతో కలిపి రూ.371 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మిగిలిన రూ.3 వేల కోట్లను సీమెన్స్‌ సంస్ధ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఉదారంగా ఇస్తుందంటూ కేబినెట్‌లో చెప్పారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద వచ్చిందంటే ఆ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది.

ఆ పదమే ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం వాటా కాస్తా రూ.330 కోట్లు ఫైనాన్సియల్‌ అసిస్టెన్స్‌గా మారిపోయింది. కుంభకోణానికి ఇక్కడే బీజం పడింది. ఒప్పంద పత్రంలో వివరాలు నింపాల్సిన చోట ఖాళీగా విడిచిపెట్టారు. ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా రాయలేదు.

జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు? చంద్రబాబు స్క్రిప్ట్, డైరెక్షన్‌ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టుపై ఈ రకంగా ఒప్పందాలు జరుగుతాయా? ఇన్ని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా? 

సీమెన్స్‌ నుంచి పైసా రాలేదు
గత ప్రభుత్వం 10 శాతం నిధులను విడుదల చేసినప్పుడు సీమెన్స్‌ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఒక్క పైసా కూడా రాలేదు. అసలు ఆ ప్రాజెక్టు గురించే ఆ కంపెనీకి తెలియదు. గత ప్రభుత్వం ఐదు దఫాల్లో రూ.371 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం షెల్‌ కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరిన వెంటనే దఫాల వారీగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. 

నోట్‌ ఫైల్స్‌ మాయం.. క్లీనింగ్‌ ఆపరేషన్‌
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ గురించి ఒక విజిల్‌ బ్లోయర్‌ టీడీపీ హయాంలోనే 2018లో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణ మొదలు పెట్టినా ఆ తరువాత అందిన ఆదేశాలతో ఆ ఫైలును పక్కనపెట్టేసింది. ఏసీబీ దర్యాప్తు చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఏసీబీ ముఖ్యమంత్రికి రిపోర్టు చేస్తుంది.

ఈ వ్యవహారం గురించి బయటకు పొక్కడంతో ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్‌ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి.

ఈ స్కిల్‌ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్‌ టెక్‌ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్‌ కట్టకుండా బోగస్‌ ఇన్‌వాయిస్‌లతో “సెన్‌ వ్యాట్‌’ కోసం క్లెయిమ్‌ చేశాయి. కోట్ల రూపాయల మేర క్లెయిమ్‌ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది.

ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. 2017లోనే ఇది బయటపడింది. వాళ్లు బయటపెట్టినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే సాక్షాత్తూ చంద్రబాబే  ఈస్కామ్‌లో అడుగులు వేయించారు కాబట్టి!
 
ఆధారాలతో రుజువైనా ఎల్లో మీడియా గగ్గోలు
ఈ స్కామ్‌పై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్ష సాధింపంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ  బాధ వర్ణనాతీతం. ఇన్ని ఆధారాలతో రుజువై అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అంటున్నాయి. ఈ కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా నలుగురిని అరెస్టు చేసింది.

సీమెన్స్‌ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ వికాస్‌ వినాయక్‌ కన్వేల్కర్, ఎక్స్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ ముకుల్‌ చంద్ర అగర్వాల్, ఆధరైజ్డ్‌ సిగ్నటరీ ఆఫ్‌ స్కిల్లార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఇండియా లిమిటెడ్‌ సురేష్‌ గోయల్‌ను అరెస్టు చేసి పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టి 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. 

దొరికిపోవడంతో..
ఇంత దారుణంగా స్కామ్‌ చేసి దొరికిపోయారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తట్టుకోలేక ఉక్రోషంతో బాధపడుతున్నాయి. ఇన్ని దారుణాలు చేసిన ఈ గజదొంగల ముఠా చట్టం నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నీఇన్నీ కావు.

నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు.  ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. వీళ్లను మళ్లీ ఏ రోజూ రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. 

సభ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు..
ఈ విషయంపై చర్చ జరుగుతుంటే వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల దగ్గర మీడియా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్ధం చేయగలరు. ఒక అబద్ధాన్ని నిజం చేయగలరు. అంతటి స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్, స్కిల్డ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ వాళ్ల దగ్గర ఉంది. ఈ సభ ద్వారా వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలనే సాక్ష్యాలు, ఆధారాలను చూపిస్తున్నాం.

అలాంటి స్కీమ్‌లే లేవన్న సీమెన్స్‌
మన అధికారులే కాకుండా ఈ వ్యవహారంపై సీమెన్స్‌ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించింది. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో, ఎంఓయూలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్‌ కంపెనీ కోర్టుకు చెప్పింది. ఇది సీమెన్స్‌ అంతర్గతంగా విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు.

తమ కంపెనీలో పనిచేసే సుమన్‌ బోస్‌ మేనేజ్‌మెంట్‌నుగానీ లీగల్‌ టీమ్‌నుగానీ సంప్రదించలేదని కూడా కోర్టుకు వెల్లడించింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, ఆర్థిక సహాయంతో కూడిన కార్యక్రమాలను సీమెన్స్‌ ఎప్పుడూ నిర్వహించలేదని, అసలు అలాంటి స్కీమ్‌లు ఏవీ తమ సంస్థలో లేవని కూడా స్పష్టం చేసింది. వారి అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అందజేశారు కూడా.

అంటే రూ.371 కోట్లు తమకు రాలేదని సీమెన్స్‌ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ డబ్బులు ఎవరికి చేరాయి? అటు తిరిగి ఇటు తిరిగి షెల్‌ కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకున్నారు. రూ.371 కోట్లను చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు. ఆనేక షెల్‌ కంపెనీల ద్వారా ఆ డబ్బు చేతులు మారి మనీల్యాండరింగ్‌తో వీళ్ల చేతుల్లోకి వచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement