మాజీ ఎమ్మెల్యే కన్నబాబుపై కేసు నమోదు
అప్పు ఇచ్చిన సొమ్ము అడిగినందుకు దౌర్జన్యం చేశారని ఫిర్యాదు
సీతమ్మధార (విశాఖ ఉత్తరం): ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కొట్టాడని ఒక వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి (కన్నబాబు)పై ద్వారకాజోన్ పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకానగర్ మొదటిలైన్‌లో ఉంటున్న సరోజిని ఇంజినీరింగ్ వర్క్స్ అధినేత పి.రాజన్నబాబు దగ్గర నుంచి కన్నబాబు స్ధలం కోనుగోలు కోసం 2010 సెప్టెంబర్ 27న రూ. 50 లక్షలు అప్పు తీసుకున్నాడు.
తిరిగి ఆ డబ్బు చెల్లించమని ఇటీవల రాజన్నబాబు కోరగా ఆగస్టు 1న ఇస్తానని చెప్పారు. ఆ రోజు ఫోన్ చేస్తే 5వ తేదీకి వాయిదా వేశారు. తరువాత 20వ తేదీన ఇస్తానని చెప్పడంతో రాజన్నబాబు సోమవారం ఉదయం 11.30 గంటలకు కన్నబాబు ఇంటికి వెళ్లాడు. ఫోన్ చేయకుండా ఎందుకు వచ్చావు.. నీకు డబ్బులు తిరిగి ఇవ్వను, నీకు దిక్కున్నవారికి చెప్పకో అంటూ తనపై కన్నబాబు దౌర్జన్యం చేశాడని, కారు డ్రైవరు, సెక్యూరిటీ గార్డుతో బయటకు గెంటి?ంచాడని.. గన్‌తో కాలుస్తానని బెదిరించారని రాజన్నబాబు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు.