మండలంలోని నందవరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ నందవరం, రామానాయుడుపల్లి గ్రామాల రైతులు గురువారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం నెల్లూరు-ఉదయగిరి రహదారిపై ట్రాక్టర్లు, కంప అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు.
మర్రిపాడు, న్యూస్‌లైన్ : మండలంలోని నందవరం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ కోతలను నిరసిస్తూ నందవరం, రామానాయుడుపల్లి గ్రామాల రైతులు గురువారం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అనంతరం నెల్లూరు-ఉదయగిరి రహదారిపై ట్రాక్టర్లు, కంప అడ్డం పెట్టి రాస్తారోకో నిర్వహించారు.
రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన అధికారులు కనీసం గంటసేపు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధగంటకోసారి కోత విధిస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వరి పంట పొట్టదశలో ఉందని, నీరు అందక ఎండిపోతోందన్నారు. ఇదేంటని ప్రశ్ని స్తే సబ్‌స్టేషన్ సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. రాస్తారోకోతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
దీంతో ఎస్‌ఐ విజయ్‌శ్రీనివాస్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి రైతులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అయితే విద్యుత్ సబ్ స్టేషన్‌కు తాళాలు, కంప వేసి ఆశాఖ వచ్చే ఏఈ వచ్చే వరకు తీసేది లేదని భీష్మించారు. ఏఈని ఎస్‌ఐ పిలిపించి రైతులతో మాట్లాడించారు. ఇకపై వ్యవసాయానికి విద్యుత్‌ను ఏడుగంటలు సక్రమంగా సరఫరా చేస్తామని ఏఈ విశ్వనాథ్ హామీ ఇచ్చారు. రైతులు శాంతించారు. ఈ కార్యక్రమంలో రైతులు కొప్పోలు వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, నరసింహులు, లక్ష్మీరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.