సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఇన్నాళ్లూ అనావృష్టి కన్నీళ్లు పెట్టిస్తే.. ఇపుడేమో అతివృష్టి దెబ్బకొట్టింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను కోలుకోకుండా దెబ్బకొట్టాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 3476.4 మిల్లీమీటర్ల వర్షపాతం (జిల్లా సగటు 58.9 మి.మీ) నమోదైంది. అధికారులు ఇపుడిపుడే నష్టం విలువను అంచనా వేసే పనిలో ఉన్నారు. ప్రధానంగా పత్తి రైతు పూర్తిగా దెబ్బతిన్నాడు. గురువారం సాంతం వర్షం కురుస్తూనే ఉంది. దీంతో బుధవారం నాటి వరకు 25 మండలాల పరిధిలో జరిగిన పంట నష్టంపై జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. అధికారిక గణాంకాల మేరకు 52,800 ఎకరాలోల పత్తి, 6600 ఎకరాల్లో వరిపంట దెబ్బతిన్నాయి.
దిగుబడి అంచనాల మేరకు లెక్కిస్తే ఒక్క పత్తి పంటలోనే ఏకంగా రూ.144కోట్లు, వరి పంటలో రూ.24కోట్లు ..వెరసి 168కోట్ల పంట నష్టం జరిగింది. గురువారం రాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు డిండి మండలంలో ఇద్దరు, నిడమనూరు మండలంలో ఒక వ్యక్తి గల్లంతయ్యారు. డిండి మండలంలోనే మరో ఇద్దరిని రక్షించారు. 37 మండలాల పరిధిలోని 155 గ్రామాల్లో 446 ఇళ్లు దెబ్బతిన్నాయి. కనగల్ ఎస్సీ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఆ కాలనీవాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. దామరచర్ల మండలంలోని ముంపు బాధితులను పునరావాస కేంద్రానికి చేర్చారు.
నల్లగొండ..
కనగల్ మండలంలోని జి.యడవల్లి ఊర చెరువు అలుగుపోసి చండూరు - కనగల్ రహదారి బచ్చన్నగూడెం వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నియోజకవర్గంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కనగల్ మైల సముద్రం 8 సంవత్సరాల తర్వాత అలుగుపోసింది. రెగట్టె ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి.
భువనగిరి..
మూసీ పరీవాహక ప్రాంతంలోని భూదాన్‌పోచంపల్లిలో 2050 ఎకరాలు, బీబీనగర్‌లో 1,175, వలిగొండలో 500, భువనగిరిలో 400 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. రాయగిరి, అరూర్, పోచంపల్లి మండలంలో 5ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రుద్రవెల్లి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ మార్గాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఆలేరు
ఆలేరు నియోజకవర్గంలో పత్తిపంటకు నష్టం వాటిల్లింది. వరిపంటను ఆలస్యంగా సాగు చేయడంతో దానికి పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఆలేరులో 35ఇళ్లు పాక్షికంగా, 3 ఇళ్లు పూర్తిగా, గుండాలలో 55ఇళ్లు పాక్షికంగా, ఒకటి పూర్తిగా దెబ్బతిన్నది.
మునుగోడు
నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 25వేల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. 5వేల ఎకరాల్లో పత్తి చేలు నీట మునగగా, 20వేల ఎకరాల్లో పత్తి తడిసి ముద్దయింది. మునుగోడు మండలంలో 27ఇళ్లు, చౌటుప్పల్‌లో 3, చండూరులో 50, మర్రిగూడలో 10, సంస్థాన్ నారాయణపురంలో 3ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యా యి. చండూరు మండలం బంగారిగడ్డ, బోడంగిపర్తి, ఎడవెల్లి వాగులు పొంగి పొర్లుతుండడంతో మునుగోడు, చండూరు, చౌటుప్పల్ మండలాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి.
నాగార్జునసాగర్
నియోజకవర్గంలో అకాల వర్షానికి వాగులు, వంక లు, చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. 20 వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతినగా, 1000ఎకరాల్లో వరి పోలాలు నీటి ముని గాయి. నియోజకవర్గంలో మొత్తం 31ఇళ్లు కూలి పోగా, ఒకరు మృతి చెందారు. నిడమనూరు మండలంలో 21 ఇళ్లు, పెద్దవూర మండలంలో 10 ఇళ్లు కూలిపోయాయి. నిడమనూరు మండ లం నందికొండవారి గూడెంలో చేపల వేటకు వెళ్లి గుండెబోయిన రమేశ్(18) కాల్వలో పడి మృతి చెందాడు. పేరూరు గ్రామం జల దిగ్బం ధంలో చిక్కుకుంది. తెట్టెకుంట గ్రామంలో విద్యుత్ ైవె రు తెగిపండటంతో గేదె మృతి చెందింది. రాజవరం వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో హాలియా, నిడమనూరు, దామరచర్ల మండలాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. గుర్రంపోడు మండలం కొతలాపురం, మొసంగి గ్రామాల్లో రోడ్డు తెగిపోయింది.
హుజూర్‌నగర్
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నియోజకవర్గంలో చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. హుజూర్‌నగర్ మండలంలో 100 ఎకరాలలో వరి నేలకొరిగింది. గరిడేపల్లి మండలంలో సుమారు 200 ఎకరాలలో వరి నేలకొరిగి పోగా, గరిడేపల్లిలో రెండు పూరిళ్లు కూలిపోయాయి. మఠంపల్లి మండలంలో 700ఎకరాలలో పత్తి, 300ఎకరాలలో మిర్చిపంటలకు నష్టం వాటిల్లగా, 100 ఎకరాలలో వరిపంట నేలకొరిగింది. మేళ్లచెరువు మండలంలో 9వేల ఎకరాలలో పత్తి, 2వేల ఎకరాలలో మిర్చితోటలకు నష్టం కాగా, మండలంలోని వెంకట్రాంపురం, నల్లబండగూడెం,హేమ్లాతండా, కొత్తూరులలో నాలుగు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
కోదాడ
నియోజకవర్గంలో మునగాల, నడిగూడెం, చిలుకూరు, కోదాడ మండలాల్లో ఆయకట్టేతర భూముల్లో సాగుచేసిన పత్తి నష్టం జరిగింది. నడిగూడెం, చిలుకూరు, కోదాడ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోని జలమయయ్యాయి. చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. రెండు ఇళ్లు కూలిపోయాయి.
మిర్యాలగూడ
దామరచర్ల మండలంలోని కృష్ణపట్టె గ్రామాల్లో 10వేల ఎకరాల్లో పత్తి తడిసి మొలకలు వచ్చాయి. దామరచర్ల, నర్సాపురం, కల్లేపల్లి గ్రామాల్లో 50ఎకరాల్లో వరి పంట నేలవాలింది
వేములపల్లి మండలం బొమ్మకల్లు, ఆమనగల్లు, తోపుచర్ల, పాములపాడు, గుర్రప్పగూడెం గ్రామాలలో సుమారు 300 ఎకరాల్లో పత్తి పంట పూర్తిగా తడిసింది. శెట్టిపాలెం, వేములపల్లి, ఇటిక్యాల, బుగ్గబావిగూడెం గ్రామాలలో 200 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. మిర్యాలగూడ పట్టణంలో పలు వీధులలో నీళ్లు నిలిచాయి. దామరచర్ల - అడవిదేవులపల్లి వెళ్లే దారిలో ఉన్న అన్నమేరి వాగు, దామరచర్ల - నర్సాపురం వెళ్లే దారిలో తిమ్మాపురం వద్ద పిల్లవాగు పొంగడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శెట్టిపాలెం సమీపంలోని చిత్రపరకవాగు, చిరుమర్తి సమీపంలోని పాలేరు వాగు పొంగి కల్వర్టులపై నుంచి నీళ్లు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తుంగతుర్తి
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, వరి పంటలు బాగా దెబ్బతిన్నాయి. పత్తి 10 వేల ఎకరాలలో, వరి 5వేల ఎకరాలలో దెబ్బతిన్నాయి. శాలిగౌరారం మండలంలో అత్యధికంగా 17.2మి.మీ. వర్షపాతం నమోదైంది. 25 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
నకిరేకల్
నియోజకవర్గంలో 5600 ఎకరాలలో పత్తి, 1800 ఎకరాలలో వరి పంటలకు నష్టం వాటిల్లింది. 44 గృహాలు. కట్టంగూర్ మండలంలో 23 ఇళ్లు కూలిపోయాయి. కట్టంగూర్ మండలం కురుమర్తి-గార్లబాయిగూడెం, రసూల్‌గూడెం-అయిటిపాముల మధ్య వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
దేవరకొండ
దేవరకొండ మండలంలో 39 ఇళ్లు నేలమట్టమయ్యాయి. చందంపేట మండలం తిమ్మాపురం, నేరడుగొమ్ము పరిధిలో చెరువులు తెగడంతో సుమారు వేయి ఎకరాల మేర పంట నీటమునిగింది. ఏఎమ్మార్పీ నుంచి ఊటనీరు, వరద నీరు భారీగా రావడంతో దుగ్యాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. డిండి ప్రాజెక్టులోకి 15 అడుగుల మేర వరద నీరు వచ్చిచేరింది. డిండి వాగు పారుతుండడంతో గోనబోయినపల్లి సమీపంలో ఎనిమిది మంది గొర్రెలకాపరులు వాగు మధ్యలో చిక్కుకున్నారు. వీరిని రక్షించడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. చింతపల్లి మండలంలో 60ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, అనేక ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
సూర్యాపేట
సూర్యాపేట మండలంలో 24, చివ్వెంల మండలంలో 2, ఆత్మకూర్(ఎస్) మండలంలో 14 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సూర్యాపేట మండలంలో 850ఎకరాల్లో వరి పంట నేల పాలుకాగా, చివ్వెంల మండలంలో 600, ఆత్మకూర్(ఎస్) 250, పెన్‌పహాడ్ మండలంలో 500 ఎకరాల వరి పంట నీటిపాలై ధాన్యం మొలకెత్తుతుంది.
ఎటు చూసినా కన్నీళ్లే
Published Fri, Oct 25 2013 3:17 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement