పెళ్లకూరు, న్యూస్‌లైన్: కొండంత ఆశతో రెండో పంట సేద్యానికి సమాయత్తమైన అన్నదాతలను విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండలంలోని చిల్లకూరు, జీలపాటూరు, పెళ్లకూరు, చావలి, చెంబడిపాళెం, నెలబల్లి, పుల్లూరు, పాలచ్చూరు, కలవకూరు, చింతపూడి, రోసనూరు తదితర గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాలకు పైగా రెండో పంటగా వరి సాగు చేస్తున్నారు. అయితే విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో దుక్కికి పూర్తిగా నీరందకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ప్రారంభ దశలోనే తీవ్ర విద్యుత్
కోతలు ఉండటంతో దుక్కులు ఎండిపోతున్నాయి. పెరికిన నార్లు మడుల్లోనే ఎండుతున్న పరిస్థితి నెలకొంది. మండలంలోని చిల్లకూరు, శిరసనంబేడు, కప్పగుంటకండ్రిగ, చెంబేడు క్రాస్‌రోడ్డుల్లో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నప్పటికీ విద్యుత్ కోతలు, లోఓల్టేజీలతో రైతులు అల్లాడుతున్నారు.
పరిశ్రమలకే పరిమితం: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా రోజుకు 7 గంటలు ఇవ్వాల్సి ఉండగా కనీసం ఒక్కగంట కూడా సక్రమంగా ఇవ్వడం లేదని పలువురు రైతులు విమర్శిస్తున్నారు. అయితే మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలకు అదనంగా విద్యుత్ సరఫరా అందించి అధికారులు వారి నుంచి లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు న్నాయి. ప్రతి బుధవారం పరిశ్రమలకు ‘పవర్‌హాలిడే’ ఉన్నప్పటికీ అనధికారకంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు.
ఎండుతున్న దుక్కి- రోజుల తరబడి నారుమడుల్లో నిలిచిన నారు
వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సాగునీరు అం దక దుక్కి ఎండుతోంది. నాట్లకు సిద్ధం చేసిన నారు మడుల్లోనే రోజుల తరబడి నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులకు విద్యుత్ కోతలు గండంగా మారి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో కొందరు రైతులు ఆయిల్ ఇంజన్‌లను ఏర్పాటు చేసుకుని సాగు చేస్తుండటం విశేషం. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ సరఫరా సక్రమంగా అందివ్వాలని స్థానికులు కోరుతున్నారు.
కష్టాలు పడుతున్నాం
విద్యుత్ సరఫరా సక్రమంగా లేదు. పగటివేళ ఎండకు, రాత్రి సమయాల్లో నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయానికి చేసుకున్న దుక్కి సాగునీరు లేక ఎండుతోంది.
బాలసుబ్రహ్మణ్యం,రైతు
అధికారులు చర్యలు చేపట్టాలి
పట్టెడు అన్నం పెట్టే భూమిపై ఆశతో రెండో పంట సాగు చేస్తున్నాం. విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించాలి.
శంకరయ్య, రైతు
‘కోత’ల గండం
Published Thu, May 22 2014 2:12 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement