కరెంట్ అధికారులూ..కళ్లు తెరవండి..!
జహీరాబాద్ టౌన్: వేళాపాళా లేని కరెంట్ సరఫరాతో రైతులు ఆగ్రహించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. టెంట్ వేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు బైటాయించారు. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నాం..సమస్య పరిష్కరించక పోతే రేపు రోడ్డు మీదకి వస్తాం..ఎల్లుండి పెద్ద ఎత్తు ఆందోళనలు చేపడతాం... అప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆత్మబలిదానాలు చేసుకొంటామని రైతులు హెచ్చరించారు. కరెంట్ కోతలను నిరసిస్తూ శుక్రవారం జహీరాబాద్ మండలంలోని సత్వార్, మాడ్గి,ఖాసీంపూర్,అసంద్‌గంజ్,గోపన్‌పల్లి తదితర గ్రామాల రైతులు సత్వార్ కరెంట్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతంలో చెరువులు,ప్రాజెక్టులు లేవని, కరెంట్ ఆధారపడి బోరుబావుల కింద పంటలను పండిస్తున్నామన్నారు. వందల ఎకరాల్లో చెరకు,అల్లం,పసుపు తదితర పంటలను సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయానికి ఇచ్చే 7 గంటల కరెంట్‌లో రోజుకు రెండు మూడు గంటలు కూడా సక్రమంగా సరఫరా చేయడంలేదన్నారు. ఇచ్చే కరెంట్ సరఫరాలో వేళాపాళా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
గత వారం రోజుల నుంచి కోతలు అధికమయ్యాయన్నారు. దీంతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. కరెంట్ సమస్య పరిష్కరించేంత వరకు సబ్‌స్టేషన్ నుంచి కదలమన్నారు. పరిస్థితి ఇలాగా ఉంటే రేపు రోడ్డు మీదికి వస్తాయని,ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విషయం తెలుసుకొన్న ట్రాన్స్‌కో ఏడీ తులసీరాం, జహీరాబాద్ టౌన్ సీఐ సాయిఈశ్వర్ గౌడ్‌లు సత్వార్ సబ్‌స్టేషన్‌కు వచ్చి రైతులతో మాట్లాడారు.ఏడీ తులసీరాం మాట్లాడుతూ కరెంట్ ఉత్పత్తి తగ్గడంతో పై నుంచి కరెంట్ సరఫరా నిలిపేస్తున్నారన్నారు.
వారం రోజుల్లో పరిస్థితులు మారుతుందని రైతులు సహకరించాలని కోరారు. పద్ధతి ప్రకారం కరెంట్ సరఫరా చేయాలని రైతులు కోరగా సాయంత్రం 4 నుంచి రాత్రి 7 వరకు కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకొంటానన్నారు. లభ్యతను బట్టి కరెంట్ సరఫరాను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వారం రోజుల వేచి చూస్తామని, పరిస్థితుల్లో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించి ఆందోళన విరమించారు.