కోతలపై కన్నెర్ర | formers feeling difficulties for power cuts | Sakshi
Sakshi News home page

కోతలపై కన్నెర్ర

Published Fri, Jun 27 2014 11:49 PM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

formers feeling difficulties for power cuts

కరెంట్ కోతలపై జిల్లాలో శుక్రవారం పలు చోట్ల రైతులు భగ్గుమన్నారు. రామాయంపేట, చేగుంట ప్రాంతాల్లో రోడ్లెక్కి ఆందోళనలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా తొగుట మండలం తుక్కాపూర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో రైతులు ఫర్నిచర్‌ను  ధ్వంసం చేశారు.  
 
 రామాయంపేట: కరెంటు కోతలను నిరసిస్తూ శుక్రవారం మండలంలోని మూడు గ్రామాల రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకో చేసి తమ నిరసన తెలిపారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేయడంతో పాటు ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విద్యుత్ కోతలను నిరసిస్తూ మండలంలోని  సుతార్‌పల్లి, శివాయిపల్లి, డి.ధర్మార ం గ్రామాలకు చెందిన రైతులు డి.ధర్మారం విద్యు త్ సబ్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 అనంతరం రాస్తారాకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రెండు గంటల పాటు వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, రోజులో కనీసం రెండు గంటల పాటు కూడా విద్యుత్ సరఫరా కావడం లేదని, దీంతో వరి నారు ఎండిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు అధికం కావడంతో గ్రామాల్లో తాగునీరు కూడా దొరకడం లేదన్నారు.
 
 రైతుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు వెం టనే సంఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశా రు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే నిజాంపేట సెక్షన్ ఏఈ మధుసూదన్ అక్కడకు రాగా రైతులు ఆయ న్ను నిలదీశారు. స్పందించిన మధుసూదన్ రెండురోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. దీంతో ఆందోళన విరమించిన రైతులు, కోతలు ఇలాగే కొనసాగితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
 
 చేగుంలోనూ నిరసన
 చేగుంట: సాగుకు సరిగ్గా కరెంటు సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నర్సింగి గ్రామానికి చెందిన పలువురు రైతులు శుక్రవారం  స్థానిక 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, విద్యుత్ కోతలతో 15 రోజులుగా వ్యవసాయ బోరుమోటార్లు పనిచేయడం లేదని, దీంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ కోతలను నివారించాలని కోరారు. ఇదిలావుండగా, వల్లూరు గ్రామంలోనూ గురువారం నుంచి కరెంటు సరఫరా లేదని, దీంతో తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన సబ్‌స్టేషన్ సిబ్బంది రెండురోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.
 
 కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం
 తొగుట: దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియాల్ గ్రామ రైతులు తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో గల 132/33 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను శుక్రవారం ధ్వంసం చేశారు. విద్యుత్ కోతలపై తొలుత నిరసన తెలిపారు. అధికారుల తీరుపై మండిపడుతూ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
 
 విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జార్జ్ హుటాహుటిన సబ్‌డివిజనల్ కార్యాలయానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇదే సమయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోతలను విరమిస్తామని కచ్చితమైన హామీ ఇస్తేగాని ఆందోళన విరమించబోమన్నారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్‌ఐ సుమారు 10 మంది రైతులను అదుపులోకి తీసుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement