వడదెబ్బకు సీమాంధ్రలో వివిధ జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గంగినపల్లికి చెందిన కుమ్మరి ఆదినారాయణ (50) వ్యవసాయ కూలీ
న్యూస్‌లైన్, నెట్‌వర్క్: వడదెబ్బకు సీమాంధ్రలో వివిధ జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గంగినపల్లికి చెందిన కుమ్మరి ఆదినారాయణ (50) వ్యవసాయ కూలీ. మంగళవారం ఉదయం వరిగడ్డిని లోడ్ చేసేందుకు కొత్తచెరువు మండలం మైలేపల్లికి వెళ్లాడు. ఎండలోనే పనిచేస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఇదే జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రంగన్న (70) సోమవారం గ్రామ శివార్లలో గేదెలను మేపేందుకు వెళ్లాడు.
ఎండలో ఎక్కువ సమయం ఉండటంతో సాయంత్రం ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కొత్త తిమ్మాపురంలో మంగళవారం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లిన సి.మునిరాజ (32) మధ్యాహ్నం ఎండతీవ్రతకు స్పృహ కోల్పోరుు మృతి చెందాడు. మరో ఘటనలో.. విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని రాజయ్యపేట పంచాయతీ పరిధిలోని రామన్న అగ్రహారం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ గుగ్గిలాపు తాత(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి సమీపంలోని బొమ్మినాయుని చెరువులో ఉపాధి హామీ పనికి వచ్చాడు. ఎండతీవ్రంగా ఉండడంతో తట్టతో మట్టిని మోస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు.