
సాక్షి, హైదరాబాద్: సంస్థ అధికారులకు ఆర్టీసీ దసరా కానుక ప్రకటించింది. రాష్ట్ర విభజనకు పూర్వం అధికారి హోదా పొందిన వారికి పదవీ విరమణ తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 2, 2015న ఆర్టీసీ విడిపోయిన విషయం తెలిసిందే. విభజనకు పూర్వం పదవీ విరమణ చేసిన అధికారులు (డిపో మేనేజర్, ఆపై స్థాయి).. ఆ నాటికి అధికారిక పదోన్నతి పొంది, ఆ తర్వాత పదవీ విమరణ చేసే వారికి ఈ వెసులుబాటు ఉంటుంది.
అధికారితో పాటు వారి భార్య/భర్తకూ ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ప్రీమియం కేటగిరీ బస్సుల్లో మాత్రం రాయితీ ధరలకు టికెట్ పొందాల్సి ఉంటుంది. కాగా, అధికారులకే ఈ వెసులుబాటు కల్పించడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గౌరవ సూచకంగా అందించే ఇలాంటి వెసులుబాటును కార్మికులకూ కల్పించాలని ఎండీ రమణారావుకు ఎన్‌ఎంయూ నేతలు నాగేశ్వర్‌రావు, కమాల్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాయితీలు ఇలా...
ఈడీ, హెచ్‌ఓడీలు తెలంగాణ సిటీ ఏసీ బస్సుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆంధ్రప్రదేశ్ బస్సుల్లో డీలక్స్ వరకు ఉచితం. ఎస్‌ఎస్‌వో, జేఎస్‌వోలు తెలంగాణ సిటీ బస్సుల్లో మెట్రో డీలక్స్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏపీలోనూ డీలక్స్ వరకు ఉచితం. అన్ని స్థాయిల అధికారులకు రెండు రాష్ట్రాల జిల్లా సర్వీసుల్లో డిలక్స్ వరకు ఉచితం. సూపర్ లగ్జరీ, పై కేటగిరీ బస్సుల్లో 50 శాతం రాయితీ. అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి అన్ని స్థాయిల అధికారులకు ఏపీ బస్సుల్లో డిలక్స్/అల్ట్రా డీలక్స్ వరకు ఉచితం. తెలంగాణ బస్సుల్లో డిలక్స్ వరకు రాయితీ లేదు. సూపర్ లగ్జరీ, పై కేటగిరీ బస్సుల్లో ఇరు రాష్ట్రాల బస్సుల్లో 50 శాతం రాయితీ.