
విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
నెల్లూరు (కల్చరల్) : కేఎన్‌ఆర్ స్కూల్ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించి పాఠశాల ఖ్యాతిని నలుదిశలా చాటాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. స్థానిక భక్తవత్సలనగర్‌లోని కురుగంటి నాగిరెడ్డి (కేఎన్‌ఆర్) నగర పాలక ఉన్నత పాఠశాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల స్కూల్‌ను దత్తత తీసుకున్నప్పటి నుంచి స్నేహితుల సహకారంతో అభివృద్ధి చర్యలు చేపట్టామన్నారు.
అందులో భాగంగా విద్యార్థులకు సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని అందించేందుకు సుమారు రూ.4 లక్షలు సొంత నిధులతో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్, 40 కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి సంపాదించినదంతా ప్రైవేట్ స్కూళ్లలో తమ బిడ్డల చదువుకే ఖర్చుపెట్టాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించినపుడు అలాంటి పరిస్థితి తలెత్తదన్నారు. పదో తరగతిలో ఉత్తమ గ్రేడింగ్ సాధించే విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తాను పూర్తి బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ప్రతిభ కనబరిచిన 30 మంది విద్యార్థులకు రూ.10వేల వంతున ప్రోత్సాహకాన్ని అందజేస్తానని ప్రకటించారు. ఎన్నికల వాగ్దానాల్లో మాత్రమే అభివృద్ధిని పేర్కొనే నాయకుడిని కాదని, ఎల్లవేళలా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేవాడినని ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.2 లక్షలు విరాళంగా ప్రకటించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సేవా దృక్పథాన్ని కొనియాడారు.
కేఎన్‌ఆర్ పాఠశాల విద్యార్థులకు అవసరమైన క్రీడా పరికరాలను అందించేందుకు ముందుకొచ్చిన డిప్యూటీ మేయర్ ద్వారకానాథ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నగరపాలక పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.
నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అందరూ జీతాన్ని ఇంటికి తీసుకెళ్తారని, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం తన జీతాన్ని పేద విద్యార్థుకోసం ఖర్చుపెడుతుండడం అభినందనీయమన్నారు. పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వ పాఠశాలలకు అందజేసి కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు.
అనంతరం పాఠశాల అభివృద్ధికి విరాళం ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యే, పాఠశాల సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం విజయప్రకాష్, టీచర్లు, విద్యావలంటీర్లను సత్కరించారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు తాటి వెం కటేశ్వర్లు, కార్పొరేటర్లు అపర్ణ, శ్రీపద్మ, శ్రీలక్ష్మి, షంషుద్దీన్, బాలకోటేశ్వరరావు, సిద్ధార్థ స్కూల్ అధినేత్రి గౌరి, పి.ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.