- నేటి నుంచి పభుత్వ కార్యకలాపాలు బంద్
- బదిలీలకు బ్రేక్
- రెవెన్యూ సదస్సులకు ఆటంకం
- ఎన్నికల విధులకు ఎన్జీవోలు దూరం
నిరవధిక సమ్మె
Published Thu, Feb 6 2014 1:04 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సమైకాంధ్ర కోసం ఉద్యోగ సంఘాలు మరోసారి నిరవధిక సమ్మెకు దిగాయి. గురువారం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మళ్లీ పౌర సేవలు స్తంభించనున్నాయి. ఆర్టీసీ, విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మినహా మిగిలిన అన్ని ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈసారి చేపడుతున్న ఈ సమ్మె వివిధ ప్రభుత్వ కార్యక్రమా లు, కార్యకలాపాలపై తీవ్ర ప్రభా వం చూపనుంది. ప్రధానంగా ఈ నెల 10వ తేదీ నుంచి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి.
ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నా ఎన్నికల విధులకు కూడా దూరంగా ఉండాలని ఉద్యోగులు నిర్ణయించారు. జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. సమ్మెలోకి వెళ్లడంతో రెవెన్యూ సదస్సులు కూడా జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ సమావేశాలను నిర్వహించాల్సిన వీఆర్‌ఓ, ఆర్‌ఐ, తహశీల్దార్లు అందరూ విధులను బహిష్కరిస్తుండడంతో రెవెన్యూ సదస్సులు నిలిచిపోనున్నాయి.
బదిలీలకు బ్రేక్
ఎన్నికల సందర్భంగా జిల్లాలో మూడేళ్లపాటు పనిచేసిన, ఇదే జిల్లాకు చెందిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ప్రభుత్వం కూడా బదిలీలపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేసింది. ఈ నెల 10వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు జిల్లా అధికారులు ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరో రెండు రోజుల్లో జాబితా సిద్ధం కానుంది. ఇంతలో ఉద్యోగులు సమ్మె చేస్తుండడంతో బదిలీలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బదిలీ ఉత్తర్వులు వచ్చినా తీసుకోబోమని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. బదిలీ జాబితా చేయడానికి గాని, తీసుకోడానికి గానీ అధికారులు ఉండని పరిస్థితి ఏర్పడింది. సమ్మె ముగిసిన తర్వాత ఉత్తర్వులను తీసుకుంటామని ఉద్యోగ సంఘాల చెబుతున్నాయి.
సమ్మెను విజయవంతం చేయాలి
పార్లమెంట్లు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పోరాడే విధంగా వారిపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు గురువారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్, ఏపీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు తెలిపారు. బుధవారం ఏపీఎన్‌జీఓ హోమ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయని, ట్రెజరీ ఉద్యోగుల సంఘం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
కొంత మంది కేంద్రమంత్రులు, ఎంపీలు కాంగ్రెస్ అధిష్టానానికి వత్తాసు పలుకుతున్నారని, సమైక్యాంధ్ర కోసం ఉద్యమించని వారికి వచ్చే ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని హెచ్చరించారు. ఈ నెల 7, 8 తేదీల్లో కేంద్ర మంత్రి పురందేశ్వరి నివాసాన్ని ముట్టడిస్తున్నట్టు వెల్లడించారు. ఉద్యోగులతో పాటు వ్యాపారులను, అన్ని వర్గాల వారిని, ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
Advertisement
Advertisement