కేంద్రం, ఏపీ, తెలంగాణ.. ముందస్తు ఎన్నికలు? | Early Elections In India | Sakshi
Sakshi News home page

ముందస్తు ఎన్నికలు..?

Jun 16 2018 12:58 AM | Updated on Sep 6 2018 2:53 PM

Early Elections In India - Sakshi

ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయం


సాక్షి ప్రత్యేక ప్రతినిధి
: ఈ ఏడాది చివరికల్లా లోక్‌సభతోపాటు 10 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. ఈ ఏడాది చివరకు గడువు ముగియనున్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం అసెంబ్లీలతోపాటు ఆ తర్వాత 6 నుంచి 10 మాసాల లోపు గడువు మిగిలి ఉన్న అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ ఆర్టికల్‌ 83, 85 (లోక్‌సభను గడువుకు ముందే రద్దు చేయడం), ఆర్టికల్‌ 172, 174 (రాష్ట్రాల శాసనసభల గడువును తగ్గించడం) డ్రాఫ్ట్‌ బిల్లులు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులు పార్లమెంట్‌ ముందుకు వస్తాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ అత్యున్నత వర్గాలు వెల్లడించాయి. 2019లో మళ్లీ ఎలాంటి ఎన్నికలు లేకుండా డిసెంబర్‌లోనే పది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలన్న అభిప్రాయంతో బీజేపీ ఉందని ఆ వర్గాలు తెలియజేశాయి. 2019 చివరి నాటికి ఎన్నికలు జరగనున్న ఆరు రాష్ట్రాల్లో ఒడిశా మినహా అరుణాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ అధికారంలో ఉంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో లోక్‌సభతోపాటు ఏపీ, తెలంగాణ అసెంబ్లీకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటిదాకా వేచి చూస్తే ఈ ఏడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే వాటి ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అటు శాసనసభ, ఇటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలకు వెళ్లడం వల్ల కొంతమేర ప్రతికూలత తగ్గుతుందని ఆ పార్టీ భావిస్తోంది. దానికి తోడు ప్రతిపక్షాలు మహాకూటమిగా ఏర్పడతాయని వార్తలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది దాకా ఆగితే వాళ్లకు మరింత సమయం ఇచ్చినట్లు ఉంటుందని బీజేపీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతోందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్‌ తర్వాత ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చినా సిద్ధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది. ఎక్కువ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అందుకు అవసరమైన ఈవీఎంలను సమకూర్చుకోవాలని కూడా సలహా ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే వీటికోసం కేంద్ర ఎన్నికల సంఘానికి రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. 

రాష్ట్ర శాఖలను అప్రమత్తం చేసిన బీజేపీ 
ముందస్తు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల పార్టీ ముఖ్యులను బీజేపీ అప్రమత్తం చేసింది. ముందస్తు ఎన్నికలు జరిగినా సిద్ధంగా ఉండాలని, దానికి తగ్గట్టుగా ఎజెండాను రూపొందించుకోవాలని కోరినట్లు తెలిసింది. పెద్దగా బలం లేని రాష్ట్రాల్లో పొత్తులకు ఇతర పార్టీలతో చర్చలు జరపాలని, పొత్తులకు అవకాశం లేని చోట్ల బలం ఉన్న నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్దేశించింది. పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ఓ ప్రైవేట్‌ సంస్థతో సర్వే చేయిస్తోంది. ఈ నెలాఖరుకు సర్వే నివేదిక వస్తుందని తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. ‘‘నవంబర్‌లో ఎన్నికలకు వెళ్లాలన్నది మా నాయకత్వ సూత్రప్రాయ నిర్ణయం. అయితే వన్‌ నేషన్‌– వన్‌ ఎలక్షన్‌ నినాదం మేరకు 19 రాష్ట్రాల శాసనసభలతో పాటు ఎన్నికలకు వెళ్తారా లేదా ఆరు మాసాల లోపు గడువున్న రాష్ట్రాలతో వెళ్తారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు’’అని ముఖ్య నేత ఒకరు చెప్పారు.
 
ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్‌ 

ఈ ఏడాది చివర్లోనే లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు వస్తాయని టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి సమాచారం అందింది. నవంబర్‌ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు వస్తాయని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పార్టీ ముఖ్యులు కొందరికి సమాచారం చేరవేశారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా ప్రతిష్టాత్మక కాళేశ్వరంతోపాటు మిషన్‌ భగీరథను పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రైతులకు పెట్టుబడి కోసం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి రబీ సీజన్‌కుగాను సెప్టెంబర్‌ మొదటివారంలోనే చెక్కులు అందజేసేందుకు ఇప్పట్నుంచే చర్యలు ప్రారంభించింది.

ఎన్నికల షెడ్యుల్‌ వెలువడే నాటికి కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, రైతు బంధు పథకాలను పూర్తి చేయడంతోపాటు మిగిలిన పథకాలు లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత గడువులో నిర్వహించాలని నిర్ణయించుకుంది. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా కుదరదని తేల్చిచెప్పింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. 

వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు 
ఓవైపు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలువడుతుంటే మరోవైపు వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండేళ్లుగా ఈ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్న లా కమిషన్‌ గడచిన మూడు మాసాలుగా దీనికి మరింత పదును పెట్టింది. వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌ దిశగా ముసాయిదా వర్కింగ్‌ పేపర్‌ను ప్రకటించింది. దీనిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందజేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్‌ 17న నోటిఫికేషన్‌ వెలువరించింది, దీనిపై రాజ్యాంగ నిపుణులు, రాజకీయ పార్టీలు సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను క్రోడీకరించే పనిలో ఉంది. లా కమిషన్‌ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ‘వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’కు రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం బీజేపీ భావిస్తున్నట్లు ఈ ఏడాది డిసెంబర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగే నాటికి రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తయితే 2018, 2019, 2020, 2021లో గడువు ముగిసే 19 రాష్ట్రాల శాసనసభలకు లోక్‌సభతో పాటే ఎన్నికలు జరుగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement