బతుకు పోరుకు సంసిద్ధం | From the re-start tomorrow's fisheries | Sakshi
Sakshi News home page

బతుకు పోరుకు సంసిద్ధం

Published Tue, Jun 14 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

బతుకు పోరుకు రంగం సిద్ధమైంది. రెండు నెలల విరామం అనంతరం సముద్రంలో చేపటవేటకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు.

రేపటి నుంచి చేపలవేట పున: ప్రారంభం
రెండు నెలల విరామం తర్వాత 981 బోట్లు సముద్రంలోకి
జిల్లాలో 1.12 లక్షలమంది మత్స్యకారులు
చేపలు, రొయ్యల ఆచూకీ తెలిపే టెక్నాలజీ లేనేలేదు

 

మచిలీపట్నం : బతుకు పోరుకు రంగం సిద్ధమైంది. రెండు నెలల విరామం అనంతరం సముద్రంలో  చేపటవేటకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు.జూన్15వ తేదీ అర్ధరాత్రి నుంచి చేపలవేట పునఃప్రారంభం కానుంది. వాతావరణంలో మార్పులుచోటు చేసుకోవడంతో సముద్రంలో  చేపలవేట జూదంలా తయారైంది. జిల్లా వ్యాప్తంగా 122 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరం వెంబడి ఉన్న 38 గ్రామాల్లో 1.12 లక్షలమంది మత్స్యకారులు చేపలవేట ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.  981 మరపడవల ద్వారా సముద్ర సంపదను వేటాడుతూ వచ్చే ఆదాయమే వారికి ప్రధాన ఆధారం. ప్రభుత్వం నుంచి మత్స్యకారులకు అందే సహకారం అంతంత మాత్రమే. సముద్రంతో తమ జీవితాలను పెనవేసుకున్నారు. సముద్రపు అగాధాల్లో చేపలు, రొయ్యలు ఎక్కడదొరుకుతాయో  ఇట్టే పసిగట్టేతత్వం అనుభవపూర్వకంగా వారికి ఉంది. ఇదే వారికి ఎనలేని పెట్టుబడిగా ఉపయోగపడుతోంది. సాంకేతక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా మత్స్యకారుల జీవితాల్లో  ఇసుమంతైనా మార్పు చోటు చేసుకోవడంలేదు.

 
వేటకు సంసిద్ధం

చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసే కాలాన్ని పురస్కరించుకుని  ఏటా  ఏప్రిల్ 15వ తేదీనుంచి  జూన్15  వరకు  60 రోజులపాటు సముద్రంలో చేపల వేటపై  కేంద్ర ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది.  జూన్15వ తేదీతో  నిషేధం సడలించనున్నారు.  మచిలీపట్నంలోని గిలకలదిండి హార్బర్‌నుంచి  95 మెకనైజ్డ్ బోట్లు(పెద్దబోట్లు). సముద్రతీరంలోని  నాగాయలంక, కోడూరు, మోపిదేవి, బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలనుంచి  మరో 886 మోటారైజ్డ్(ఫైబర్) బోట్ల ద్వారా చేపల వేటను మత్స్యకారులు కొనసాగిస్తూ ఉంటారు.  తీరంనుంచి 15 నాటికల్ మైళ్ల పరిధి వరకూ వీరు చేపల వేటను  కొనసాగించేందుకు వెసులుబాటు ఉంది.  మెకనైజ్డ్ బోటు  చేపల వేటకు వెళితే తిరిగి రావడానికి  వారం పడుతుంది. ఫైబర్ బోట్ల ద్వారా చేపల వేట కొనసాగించే వారు తెల్లవారు వేకువజాము 3 గంటలకు చేపల వేటకు వెళ్లి  అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరిగి వస్తారు.

 
సమాచారం ఇచ్చేవారేరి?

సముద్రంలో మత్స్యసంపద ఎక్కడ లభ్యమవుతుందో  తెలుసుకునే పరిజ్ఞానం శాటిలైట్ ద్వారా అందుబాటులోకి వచ్చింది.   జిల్లాలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా  సమాచారం ఇచ్చే ప్రక్రియ  అంతంత మాత్రంగానే అందుబాటులో ఉంది.  సముద్రంలో చేపలు, రొయ్యలు ఇన్ని మీటర్ల లోతులో, ఇన్ని కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్నాయని మత్స్యశాఖ అధికారులు చేపటవేట కొనసాగించే వారికి ఎస్‌ఎంఎస్‌ద్వారా, హ్యామ్  రేడియోల ద్వారా సమాచారం అందించాలి. అయితే జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.  గిలకలదిండి హార్బర్, గిరిపురంలో ఈ సమాచార కేం్రద్రాలను ఏర్పాటు చేశారు.  మత్స్యశాఖ పర్యవేక్షణలో జరగాల్సిన ఈ  పనిని  స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు.ఆ సంస్థలు తమ వద్ద ఉన్న  సాంకేతిక పరికరాలు మరమ్మతులకు గురయ్యాయంటూ సమాచారం ఇవ్వడం నిలిపివేస్తున్నారు. ఈ వ్యవస్థను ఎప్పటికి పునరుద్ధరిస్తారో మత్స్యశాఖ అధికారులే చెప్పలేని దుస్థితి నెలకొంది.

 
సముద్రంలోనే జీవనం

గిలకలదిండి హార్బర్‌నుంచి అత్యధికంగా మెకనైజ్డ్ బోట్లు, మోటారైజ్డ్ బోట్లు చేపల వేటకు వెళుతుంటాయి.  ఒక్కో మొకనైజ్డ్ బోటులో ఏడునుంచి ఎనిమిదిమంది ఉంటారు. ఒక డ్రైవరు, మిగిలిన వారిని కళాసీలని పిలుస్తారు.  వారంపాటు సముద్రంలోనే ఉండి చేపలవేట కొనసాగించే వీరు  ఏడాదిలో అధిక రోజలు సముద్రంలోనే గడుపుతారు.  బోటుకు ఏవైనా చిన్న,చిన్న రిపేర్లు ఉంటే ఒకటి రోజులో చేసుకుని వెంటనే మళ్లీ  వేటకు వె ళతారు.   నెల్లూరు జిల్లా కావలి, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ తదితర ప్రాంతాలకు చెందిన వారు గిలకలదిండి హార్బర్ నుంచి చేపల వేటకు వెళుతుంటారు.  బోటు యజమానులు చేపలు,రొయ్యల వేటలోనూ, బోటు నడపడంలోనూ ఇతర ప్రాంతాలకు చెందిన  నిపుణులను గుర్తించి వారికి అధిక మొత్తంలో నగదు ఇచ్చి సముద్రంలో చేపలు, రొయ్యల వేటకు పంపుతుంటారు. గిలకలదిండి హార్బర్‌లో 80శాతం మంది ఇతర జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. అత్యధిక రోజులు కుటుంబాలకు దూరంగా సముద్రంలోనే ఉంటారు.

 

జీవనభృతి ఎప్పటికో ...
జిల్లాలో 4,200మంది మత్స్యకారుల కుటుంబాలకు చేపలవేట నిషేధ సమయంలో జీవనభృతిగా ఒక్కొక్క కుటుంబానికి రూ. 4వేలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది రూ. 4వేలు ఇస్తామని ప్రకటించి రూ. 2వేలు మాత్రమే అందజేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో నగదును అందజేస్తారా, లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. మత్స్యకారులకు రక్షణ కోసం లైఫ్‌జాకెట్లు తదితర పరికరాలను అందజేయాల్సి ఉంది. అయితే ఈ పరికరాల అందజేతలో మత్స్యశాఖ అధికారులు తీవ్రజాప్యం చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన సముద్రంలో చేపలవేట కొనసాగిస్తున్న నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన ఫైబర్‌బోటును మరో పెద్దబోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సొర్లగొందికి చెందిన వాటపల్లి వీరనారాయణ (55), కొక్కిలిగడ్డ భిక్షం (45) మరణించారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసుల విచారణలో వీరి వద్ద లైఫ్ జాకెట్లు లేవని తేలింది. మత్స్యకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వటంలోనూ జాప్యం చేస్తున్నారని మత్స్యకారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement