ఇన్నాళ్లకు..
అనంతపురం కార్పొరేషన్ : మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పాలక వర్గం కొలువుదీరనుంది. కొద్ది గంటల్లో స్థానిక సంస్థల సారథుల ఎన్నిక జరగనుంది. అనంతపురం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కదిరి, ధర్మవరం, హిందూపురం, గుంతకల్లు, రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, మడకశిర మున్సిపాలిటీలు, గుత్తి, పుట్టపర్తి, పామిడి నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌ను కార్పొరేటర్లు/కౌన్సిలర్లు నేడు (గురువారం) ఎన్నుకోనున్నారు. మండలాల్లో ఎంపీపీల ఎన్నిక శుక్రవారం జరగనుంది.
కోరం తప్పనిసరి..
కార్పొరేషన్, మున్సిపాలిటీల సారథుల ఎన్నికకు సంబంధించి ఎన్నికల అధికారి, కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం సమావేశం ప్రారంభమవుతుంది. తొలుత కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా ఎన్నికైన వారు తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తారు. మేయర్,డిప్యూటీ మేయర్/చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు అర్హులైన వారిలో సగం మంది సమావేశం ప్రారంభమైన గంటలోగా హాజరైతే కోరం ఉన్నట్లు.
అలా లేకపోతే మరుసటి రోజు సమావేశం నిర్వహిస్తారు. మేయర్/చైర్మన్ పదవికి పోటీచేసే వారి పేరును ఓ సభ్యుడు సూచిస్తే.. మరో సభ్యుడు బలపరచాలి. ఒకరి కంటే ఎక్కువ మంది పో టీలో ఉంటే వారికి మద్ధతు ఇచ్చేవారు వేర్వేరుగా చేతులు పైకి ఎత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ తతంగాన్ని ప్రిసైడింగ్ అధికారి రికార్డ్ చేస్తారు. ఎవరికి ఎక్కువ మంది మద్దతు తెలిపితే వారు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. సమానంగా ఓట్లు వస్తే డ్రా (లాటరీ) పద్ధతిలో ఎంపిక చేస్తారు.
ఎంపీలకు ఒక చోటే అవకాశం..
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి.. ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే, ఎంపీ ఓటు వేసేందుకు అర్హులు. ఎంపీ తాను ప్రాతినిధ్యం వహించే లోక్‌సభ స్థానం పరిధిలో ఏదో ఒక మున్సిపాలిటీలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా ఉండాలి. జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సారథుల ఎన్నికల ప్రక్రియకు ఎమ్మెల్యే, ఎంపీలకు ఆహ్వానం ఉన్నా ఓటు హక్కు ఉండదు.
మేయర్ అభ్యర్థిగా స్వరూప
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా 20వ డివిజన్ కార్పోరేటర్ మదమంచి స్వరూపను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రకటించారు. ఉప మేయర్‌గా 33వ డివిజన్ కార్పొరేటర్ సాకే గంపన్న పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు సీఎం రమేష్ స్పష్టం చేశారు.