చిత్తూరు (సిటీ), న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాలోని దస్తావేజు లేఖకులు ఆందోళన ఉద్ధృతం చేయనున్నారు. రాష్ర్ట సంఘం పిలుపు మేరకు గురువారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇది కార్యరూపం దాల్చితే చిత్తూరు, తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, వాటి పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోనున్నాయి.
దస్తావేజు రిజిస్ట్రేషన్లు, సొసైటీ రెన్యూవల్స్, ఈసీలు, నకళ్లు, 10-1 అడంగళ్ల మంజూరును రిజిస్ట్రారు కార్యాలయం నుంచి మీ-సేవ కార్యాలయాలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
దీంతో సంబంధిత రిజిస్ట్రారు కార్యాలయాలను నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుబండి లాగిస్తున్న సుమారు 900 మంది దస్తావేజు లేఖకులు ఉపాధి పోనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ లేఖకులు పలుమార్లు ఆందోళనలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు గురువారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి!
దస్తావేజు లేఖకులు సమ్మెలోకి వెళితే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడనుంది. చిత్తూ రు, తిరుపతి జిల్లా రిజిస్ట్రారు కార్యాలయాలు, వాటి పరిధిలోని 23 సబ్ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రోజుకు దాదాపు * 40 లక్షల వరకు ఆదాయం తగ్గిపోనుంది. ఇప్పటికే సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు తగ్గి ప్రభుత్వానికి రాబడి పడిపోయింది. ఈ సమయంలో దస్తావేజు లేఖకుల సమ్మె మొదలైతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమ్మెను జయప్రదం చేయండి
జిల్లాలో గురువారం నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని చిత్తూరు రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖకుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శంకరనారాయణ, రవి విజ్ఞప్తి చేశారు.
ఏకగ్రీవ ఆమోదం
చిత్తూరులోని ఓ కల్యాణ మండపంలో బుధవారం దస్తావేజు లేఖకుల సమావేశం నిర్వహించారు. నిరవధిక సమ్మెపై ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ్యులు, దస్తావేలు లేఖకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె సాగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో 25 మంది దస్తావేజు లేఖకులు, 20 మంది డీటీపీ ఆపరేటర్లు, 10 మంది ఫొటోగ్రాఫర్లు, 20 మంది సహాయకులు పాల్గొన్నారు.
ఆందోళన బాట
Published Thu, Jan 16 2014 5:50 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM
Advertisement
Advertisement