సాక్షి, కాకినాడ : ప్రాదేశిక (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికల్లో పోటీ చేసే వారు నిబంధనలను మన్నించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఆమె జెడ్పీ సీఈఓ సూర్యభగవాన్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆదివారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో గ్రామీణ ఓటర్లు 26,22,103 మంది ఉండగా వారిలో పురుషులు 13,15,337 మంది, మహిళలు 13,06,766 మంది. వీరంతా 57 మంది జెడ్పీటీసీ సభ్యులను, 1063 మంది ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది.
1063 ఎంపీటీసీ స్థానాలకు (రాజమండ్రి నగర పాలక సంస్థలో విలీనానికి ప్రతిపాదించిన రాజమండ్రి రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని గ్రామాలను ముందే మినహాయించారు) రిజర్వేషన్లు ఖరారు చేయగా సామర్లకోట మండలంలోని రెండు పంచాయతీల పరిధిలో మూడు స్థానాలకు, కాకినాడ రూరల్‌లో అయిదు పంచాయతీల పరిధిలోని 18 స్థానాలకు కోర్టు స్టేటస్ కో వల్ల ఎన్నికలు జరగడం లేదు. ప్రాదేశిక ఎన్నికల కోసం 3,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 16,205 మందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నారు. సోమవారం నుంచి ఈనెల 20 వరకూ రోజూ ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు.
2న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యంతరాలుంటే 22 లోపు జెడ్పీటీసీల స్థాయిలో కలెక్టర్ వద్ద, ఎంపీటీసీల స్థాయి లో డిప్యూటీ ఎన్నికల అధికారులుగా వ్యవహరించే ఆర్డీఓల వద్ద అప్పీల్ చేసుకోవచ్చు. వీటిపై 23న సాయంత్రం 5 గంట ల లోపు విచారణ జరిపి పరిష్కరిస్తారు. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
ఇవీ నిబంధనలు..
జెడ్పీటీసీ అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీలు రూ.2500, ఇతరులు రూ. 5 వేలు, ఎంపీటీసీ అభ్యర్థుల్లో ఎస్సీ,ఎస్టీలు రూ.1250, ఇతరు లు రూ.2500 డిపాజిట్‌గా చెల్లించాలి. అభ్యర్థుల కనీస వయ సు 21 ఏళ్లుండాలి. ఏప్రిల్ 6న ఉదయం ఏడు నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే నెల 11న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ క్రమంలో ఏమైనా మార్పులుంటే తెలియజేస్తారు. అభ్యర్థులు నామినేషన్లతో పా టే ఆస్తుల డిక్లరేషన్ ఇవ్వాలి. దీన్ని డిప్యూటీ తహశీల్దార్ లేదా గెజిటెడ్ స్థాయి అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు ఇవ్వాలి.
ఎంపీటీసీ అభ్యర్థి అదే ప్రాదేశిక నియోజకవర్గంలో, జెడ్పీటీసీ అ భ్యర్థి పోటీచేసే మండల పరిధిలో ఓటర్లై ఉండాలి. వారి అభ్యర్థిత్వాలను ప్రతిపాదించే వారు కూడా అవే పరిధుల్లో ఓటర్లై ఉండాలి. రేషన్ డీలర్లు పోటీ చెయ్యొచ్చు, కానీ అంగన్ వాడీ, నీటి సంఘాల ప్రతినిధులు, చారిటబుల్ ట్రస్ట్‌ల ప్రతినిధులు పోటీ చేయకూడదు. ఓటర్లను వాహనాల్లో పోలింగ్ స్టేషన్లకు తరలించడాన్ని నేరంగా పరిగణిస్తారు. పోలింగ్ స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలో ప్రచారం నిషిద్ధం. ప్రచార కరపత్రాలపై ముద్రించిన వారి వివరాలుండాలి. జెడ్పీటీసీ అభ్యర్థి రూ.2 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ సమయంలో అభ్యర్థితో నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ర్యాలీగా వస్తే ఆ ఆర్భాటానికి అయ్యే ఖర్చును లెక్కించి అభ్యర్థి ఖాతాలోనే వేస్తారు.
పోస్టర్ల ఆవిష్కరణ
కాగా ఓటర్లను చైతన్య పరిచేందుకు ‘నోటుకు ఓటు.. ప్రజాస్వామ్యానికి చేటు’, ‘ఓటు విలువ తెలుసుకో.. విజ్ఞతతో ఎన్నుకో’ వంటి నినాదాలతో ముద్రించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. డీపీఓ శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు, బీజేపీ నుంచి వేటుకూరి సూర్యనారాయణరాజు, బీఎస్పీ నుంచి చొల్లంగి వేణుగోపాల్, టీడీపీ నుంచి మందాల గంగసూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హద్దులు మీరొద్దు
Published Mon, Mar 17 2014 1:22 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM
Advertisement