జగన్ రాక సందర్భంగా కుప్పంలో పోటెత్తిన జనం
కుప్పం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రాక సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో జనం పోటెత్తారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం అన్న విషయం తెలిసిందే. ఇక్కడ జగన్ సమైక్య శంఖారావం పూరించనున్నారు. సమైక్య శంఖారావం భారీ బహిరంగ సభ కోసం జనం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సమైక్యవాదులతో కుప్పం రోడ్లు కిక్కిరిసిపోయాయి. రోడ్లు నిండిపోవడంతో జనం జగన్ కోసం మేడలపైన, మిద్దెలపైన ఎక్కి ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా జనమే జనం. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
అంతకు ముందు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం వెళ్లి అక్కడ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చారు. అండగా ఉంటామని జగన్ వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత వెండిగంపల్లెలో మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.