గాలేరు-నగరి పనులు పూర్తి చేస్తేనే సస్యశ్యామలం
ఎమ్మెల్యే ఆది స్పష్టీకరణ
జమ్మలమడుగు: రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సుఖంగా ఉండాలన్నా, వారి భూములు సస్యశ్యామలం కావాలన్నా గాలేరు-నగరి వరదకాలువ పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామంలో దెబ్బతిన్న శనగ పంటలను ఏడీఏ అనిత, వ్యవసాయాధికారి రాంమోహన్‌రెడ్డి, రైతులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతులు వేసిన శనగ పంట ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతినడంతో పూర్తిస్థాయిలో దిగుబడి తగ్గి రైతులకు నష్టాలు మాత్రమే మిగిలాయన్నారు.
ప్రతి యేటా రాయలసీమ ప్రాంతంలో వర్షాధారంపై సాగుచేస్తున్న రైతులు నష్టపోవలసి వస్తున్నదన్నారు.రైతుల క ష్టాలు,రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాలో మిగిలిన పనులకు రూ. 1500 కోట్లు కేటాయించి పనులను పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా పొలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆనీటిని నాగార్జున సాగర్‌కు మళ్లించి శ్రీశైలం నుంచి వచ్చే జలాలను రాయలసీమ వాసులు వాడుకునేందుకు చర్యలను చేపట్టాలన్నారు. కర్నూలుజిల్లా ఆవుకు నుంచి గండికోట ప్రాజెక్టు వరకు గాలేరు-నగరి వరదకాలువతో పాటు, టన్నెల్ కూడ పూర్తయిందన్నారు.
అయితే దాదాపు 20కిలోమీటర్లమేర పూర్తికాకపోవడంతో మిగులు జలాలను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నామన్నారు. ప్రతి ఏడాది కృష్ణ వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఈ నీటిని వాడుకుంటే రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడంతో పాటు ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మైలవరం జెడ్పీటీసీ సుబ్బిరామిరెడ్డి, నాయకులు కేవీ కొండారెడ్డి, రైతులు గురప్ప, శివారెడ్డి, రవీంధ్రనాథరెడ్డి పాల్గొన్నారు.