జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఇందుకు ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు వేదికగా మారాయి.
► టీడీపీలో ఒలంపిక్ ఎన్నికల చిచ్చు
► వర్గాలుగా విడిపోయిన ఇద్దరు ఎంపీలు
► నిన్న సంస్థాగత ఎన్నికలు
► నేడు ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలే వేదిక
► రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు
సాక్షి, చిత్తూరు : జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఇందుకు ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు వేదికగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్ పోటీకి దిగడంతో జిల్లాలో ఆ పార్టీ ముఖ్య నేతలతో పాటు తెలుగు తమ్ముళ్లు రైండు వర్గాలుగా విడిపోయారు. కొందరు జయదేవ్‌కు మద్దతు పలకగా మరికొందరు సీఎం రమేష్‌ను బలపరుస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ సైతం రెండుగా విడిపోయింది. దీనికి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈనెల 4వ తేదీన తిరుపతిలో సమావేశమైన ఒలంపిక్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో జిల్లాకు చెందిన ుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నిక చెల్లదని, తాను కూడా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని జిల్లాకు చెందిన అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ప్రకటించారు. జిల్లాలో పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఇదే సమయంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఆంద్రప్రదేశ్ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలలో సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీంతో ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక వివాదంగా మారింది. ముందు ఎన్నికైన గల్లా జయదేవ్ నిజమైన అధ్యక్షుడంటూ అదే రోజు గుంటూరులో సమావేశమైన ఒలంపిక్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ఆదివారం జరిగిన ఎన్నికలకు ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్ ప్రతినిధులు హాజరు కాలేదని, ఈ ఎన్నిక చెల్లదని వారు వాదిస్తున్నారు. గల్లా జయదేవ్‌ను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధుల సమక్షంలో ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జయదేవ్ ఒలంపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదని, సంఘంలోని సభ్యులెవరూ ఆయనకు మద్దతు ఇవ్వలేదని సీఎం రమేష్ వాదిస్తున్నారు. ఎన్నికలు సభ్యుల సమక్షంలో జరగాలన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికే సక్రమమైందిగా ఆయన వాదిస్తున్నారు. అధ్యక్షుడిగా తానే ఎన్నికైనట్లు రమేష్ ప్రకటించారు.
తీవ్ర స్థాయికి విభేదాలు
ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నిక వేదికగా గల్లా జయదేవ్, సీఎం రమేష్ వర్గాలు తలపడడంతో అధికార పా ర్టీలో వర్గ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. ఇప్పటికే ఆ రెండు వర్గాల మధ్య జిల్లాలో గ్రూపు తగదాలున్నాయి. ప్రతిదానికీ ఇద్దరూ పోటీపడుతుండడంతో నేతలు, కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి తలపడుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం క్రషింగ్ నిలిపివేసిన చిత్తూరు సహకార చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకునేందుకు గల్లా బృందం పావులు కదపగా, కర్మాగా రం తనకే కావాలంటూ సీఎం రమేష్ పోటీకి దిగినట్లు సమాచారం. గల్లా అరుణకుమారికి ఎమ్మెల్సీ పదవి వి షయంలోనూ సీఎం రమేష్ అడ్డుపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల్లోనూ ఈ విభేదాలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి మొదలైన తెలుగు తమ్ముళ్ల గొడవలు ఇప్పటికే జిల్లా మొత్తం పాకాయి. తాజాగా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష పదవి విషయంలో మరోసారి రచ్చకెక్కాయి.