ఒకటే పని.. రెండు ప్రారంభోత్సవాలు | Gampa Govardhan, Shabbir Ali Suppoters Clash at Bikkanur | Sakshi
Sakshi News home page

ఒకటే పని.. రెండు ప్రారంభోత్సవాలు

Published Mon, Dec 23 2013 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

Gampa Govardhan, Shabbir Ali Suppoters Clash at Bikkanur

భిక్కనూరు, న్యూస్‌లైన్ : అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ సమస్య తలెత్తుతోంది. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల తేదీలను ముందుగా ఖరారు చేసి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పిలవాల్సిన అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో భిక్కనూరు మండలంలో ఇటీవల జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలోనూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంటోంది. తాజాగా ఆదివారం భిక్కనూరు మండలం బాగిర్తిపల్లిలో ఈ సమస్య పునరావృతం అయ్యింది. బాగిర్తిపల్లిలో బీటీ రోడ్డు మరమ్మతుకు రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. వీటి పనులను ప్రారంభించడానికి ఆదివారం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ వస్తున్నారని టీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని నిధులు మంజూరు చేయించింది తమ నాయకుడు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అంటూ వాదనకు దిగారు.
 
 దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరు పార్టీల నాయకులు బాహాబాహీకి సిద్ధమయ్యారు. ఎస్‌ఐ గంగాధర్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతపరిచారు. ఘర్షణ సద్దుమణిగాక కాంగ్రెస్ నాయకుడు, స్థానిక సర్పంచ్ శ్రీశైలం రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మరోవైపు ఇదే రోడ్డు పనులను ప్రారంభించారు. అసలు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించే కార్యక్రమంలో అధికారులెవరూ పాల్గొనకపోవడం గమనార్హం. అధికారులు రోడ్డు ప్రారంభ పనులకు ముహూర్తం నిర్ణయించి ప్రజాప్రతినిధులను పిలిచి ఉంటే ప్రొటోకాల్ సమస్య తలెత్తేది కాదని పలువురు పేర్కొంటున్నారు.
 
 గతంలో బస్వాపూర్, గుర్జకుంట గ్రామాల్లోనూ ఇలాంటి సమస్యే ఉత్పన్నమైంది. ప్రొటోకాల్ పాటించలేదంటూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను తమ ప్రచారాలకు వేదిక చేసుకునేందుకు ఇరు పార్టీలు యత్నిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ విభేదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు ప్రతి వేదికనూ తమ రాజకీయాలకు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు ప్రారంభోత్సవాల సందర్భంగా ఉన్నతాధికారులనుంచి అనుమతి తీసుకోకపోవడం, ఆదరాబాదరగా వ్యవహరించడంలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement