గండ్ర వెంకట రమణారెడ్డి
దేశంలో అత్యంత దౌర్భాగ్య నాయకుడు ఎవరైన ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ప్రభుత్వ చీఫ్ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే విషయంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సోమవారం గండ్ర వెంకట రమణారెడ్డి హైదరాబాద్లో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అంటూ గతంలో బాబు లేఖ ఇచ్చిన సంగతిని గండ్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్కి మతిభ్రమించిందని గండ్ర ఎద్దేవా చేశారు.
తెలంగాణ బిల్లు లోక్సభకు వచ్చిన సమయంలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల గండ్ర ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలసి చంద్రబాబు ఆ విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగా బీజేపీ అగ్రనేతలను బాబు కలసి సమావేశం కావడంపై గండ్ర మండిపడుతున్నారు. అలాగే లగడపాటి విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ఆయన గురువారం పార్లమెంట్లో వ్యవహరించిన తీరుపట్ల ఇప్పటికే సొంత పార్టీ నాయకులే కాకుండా వివిధ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.