అక్బరుద్దీన్ హత్యకు కుట్ర!
బెంగళూరు / హిందూపురం / హైదరాబాద్, న్యూస్‌లైన్: మజ్లిస్ నాయకుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (42) హత్యకు కుట్ర పన్నినట్టు చెబుతున్న ఓ పేరుమోసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా నాయకుడిని, అతని అనుచరులను అనంతపురం, బెంగళూరు పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ముఠా నాయకుడు కుణిగల్ గిరీశ్ అలియాస్ గిరి అలియాస్ బాస్‌తో పాటు అతని అనుచరులను పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మైనారిటీ ఎమ్మెల్యేను హతమార్చడం ద్వారా ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్‌ల్లో సంచలనం రేపి డాన్‌గా గుర్తింపు పొందడానికి కుణిగల్ స్కెచ్ వేశాడని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు తమకు సమాచారం అందడంతో నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. అక్బర్ హత్యకు ‘సుపారీ’ తీసుకున్న ఓ ముఠా పోలీసులకు చిక్కిందన్న వార్తలతో మజ్లిస్ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. అక్బర్ సోదరుడు, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఈ ఉదంతంపై విచారణ జరపాలని కోరారు. అయితే అనంతపురం పోలీసులు మాత్రం సుపారీ కుట్రతో ఈ ముఠాకు సంబంధం లేదంటున్నారు. 2011, ఏప్రిల్ 30న మహ్మద్ పహిల్వాన్ కుటుంబీకులు హైదరాబాద్ పాతబస్తీలోని బార్కాస్ వద్ద అక్బర్‌పై కత్తులు, తుపాకులతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. ఆ దాడిలో బుల్లెట్ గాయాలు, కత్తిపోట్లతో కుప్పకూలిన అక్బర్ చాలాకాలం ఆస్పత్రిలో ఉండి కోలుకున్నారు. కర్ణాటకలోని తుమకూరుజిల్లా కుణిగల్ తాలూకా హోసూరుకు చెందిన గిరి పలు కేసుల్లో నిందితుడు.
హిందూపురంలో మకాం వేసి దొంగతనాలు, దోపిడీలు చేయించేవాడు. దారి దోపిడీలు, లూటీలు, హత్యలతో తమకు నిద్రలేకుండా చేస్తున్న గిరిని పట్టుకోవడానికి కర్ణాటక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హిందూపురంలో ఉన్నట్టు సమాచారం అందడంతో వారున్న ప్రాంతాన్ని శనివారం అర్ధరాత్రి చుట్టుముట్టాయి. వారు బైకులపై పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. బైక్ అదుపు తప్పడంతో గిరి కిందపడి గాయపడ్డాడు. అతనితో పాటు అనుచరులు మంజునాథ్, వాసు, జగ్గ, గోవిందలను పట్టుకుని బెంగళూరు తరలించారు. మార్గమధ్యంలో గోవింద లఘుశంక కోసమని దిగి బండరాయితో తమపై దాడికి యత్నించి తమ కాల్పుల్లో గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అతన్ని బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. గిరి నుంచి ఒక తపంచా, రెండు రౌండ్ల బుల్లెట్లు, అనుచరుల నుంచి రెండు తపంచాలు, భారీ నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో మరో 16 మంది గిరి అనుచరులను కూడా అరెస్టు చేశారు. గిరిపై 88 దాకా కేసులున్నాయి.
హైదరాబాద్‌లో రెక్కీ?
అక్బర్ హత్యకు గిరి గ్యాంగ్ హైదరాబాద్‌లో నాలుగుసార్లు రెక్కీ నిర్వహించినట్టు విచారణలో వెలుగు చూసింది. ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఎక్కువగా ఉండటంతో వీలుగాక ఊరుకున్నారని పోలీసులు తెలిపారు. ఎన్నికలయ్యాక మరో రెండుసార్లు హైదరాబాద్ వెళ్లొచ్చారన్నారు.