
గన్‌మెన్‌ను సరెండర్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంశీ
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. టు ప్లస్ టు గన్‌మెన్‌లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని కోరారు అయితే ఏపీ సర్కార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనకు అదనంగా సెక్యూరిటీ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కి తిప్పి పంపించివేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ ...‘నా గన్‌మెన్‌కు కేవలం ఒక పిస్టల్ ఇచ్చారు. కనీసం కార్బన్ వెపన్ కూడా ఇవ్వలేదు. మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా లైసెన్స్‌డ్ ఆయుధాలు మూడింటిని రెన్యువల్ కోసం పోలీస్ స్టేషన్‌లో అప్పగించా. కనీసం వాటిని కూడా తిరిగి ఇవ్వలేదు’ అని అన్నారు.