
చిరంజీవితో మాట్లాడి చెబుతా: గంటా
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో వేడి రాజేస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పావులు కదుపుతున్నారు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా గంటాను బరిలో నిలబెట్టవచ్చనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి కేంద్ర మంత్రి చిరంజీవితో మాట్లాడిన తర్వాతే తన నిర్ణయం వెల్లడిస్తానని గంటా చెబుతున్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన గంటాకు, ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక చిరు సూచన మేరకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా వ్యవహరిస్తున్న గంటా శ్రీనివాసరావును రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిపి అధిష్టానానికి షాక్ ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా కాంగ్రెస్కు మూడు దక్కనున్నాయి. ఇదిలావుండగా, రాజ్యసభ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడిన జేసీకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అయితే ఆయనింకా స్పందించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ను ధిక్కరిస్తూ పోటీచేస్తున్న జేసీకి ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది గందరగోళంగా మారింది.