
ఉమ్మడి రాజధాని అనే ఫీలింగ్ రావడం లేదు: గంటా
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఉమ్మడి రాజధాని అనే ఫీలింగ్ రావడం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన ఏపీ మంత్రులతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకేనని మంత్రులు తెలిపారు. మొత్తం ఏడుగురు మంత్రులు వెళ్లారు.
సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్దేనని గంటా అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇక్కడ సబ్ ఆర్డినేట్ ప్రభుత్వం కాదు అని గంటా గుర్తు చేశారు. తక్షణమే సెక్షన్ - 8 అమలు చేయాలని గవర్నర్ను కోరామని గంటా తెలిపారు. ఏడాదిగా ఆంధ్రా ఉద్యోగులకు, ప్రభుత్వానికి, ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి గంటా ఈ సందర్భంగా సూచించారు.
కేసీఆర్ తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం: కేఈ
ముఖ్యమంత్రి, మంత్రులని చూడకుండా మాట్లాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ గవర్నర్ వద్దకు తీసుకెళ్లామని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. గవర్నర్తో సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో శాంతి భద్రతల బాధ్యత గవర్నర్దేనని కేఈ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుంకేశుల డ్యాం బాంబులతో పేల్చేస్తామంటున్నారని కేఈ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై గివర్నర్ సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా కేఈ తెలిపారు.