
బాబు అబద్ధాలకు నిదర్శనాలివే: గట్టు
ఆయన హయాంలోనే దారిద్య్రం పెరిగింది
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్ల హయాంలో రాష్ట్రంలో దారిద్య్రం తొలగిపోయిందంటూ పచ్చి అబద్ధాలు చెప్పారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. బాబు హయాంలోనే దారిద్య్రం విజృంభించిందని పేర్కొన్న ఎకనమిక్ సర్వే రిపోర్ట్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం గట్టు మీడియాతో మాట్లాడారు.
బాబు పాలన పగ్గాలు చేపట్టిన నాటికి రాష్ట్రంలో కోటి 53 లక్షల 96వేల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండేవారని, అలాంటిది ఆయన తొమ్మిదేళ్ల పాలన ముగిసిన 2003-04 నాటికి ఆ సంఖ్య 2 కోట్ల 35 లక్షల 10 వేలకు పెరిగిందని, పట్టణాల్లో సైతం ఇదేమాదిరిగా బాబు అధికారంలోకి వచ్చేనాటికి 79 లక్షల మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే 2004 నాటికి ఈ సంఖ్య కోటి 80 లక్షలకు పెరిగిందని గణాంక సహితంగా వివరించారు. అయితే, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత 2009 నాటికి ఈ సంఖ్యను కోటి 27 లక్షలకు కుదించగలిగారని వివరించారు.