కల్లూరు, న్యూస్‌లైన్:
35 సంవత్సరాల క్రితం కలిసి ఇంటర్మీడియట్ చదువుకున్న వారంతా ఒక్క చోట కలుసుకున్న అరుదైన సంఘటనకు ఆదివారం కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికైంది. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1977-79 సంవత్సరం చదువుకున్న వారంతా 35 సంవత్సరాల తర్వాత కుటుంబ సమేతంగా ఒక్కదగ్గర కలిసి గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ సరదాగా గడిపారు. ఐఏఎస్ కేడర్ నుంచి శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వివిధ హోదాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నతస్థాయిలో ఉన్న ప్రముఖులు వారి హోదాలను మరచిపోయి ఆనందంగా గడిపారు. వీరందరిని ఒక దగ్గరకు చేర్చేందుకు కల్లూరు పట్టణానికి చెందిన దోసపాటి భాస్కర్‌రావు, ఎస్‌కే ఇస్మాయిల్, కే. వెంకటాచార్యులు, వలసాల పురుషోత్తమ్, గుర్నాధరావు, సుగుణాకర్‌రావులు రెండు నెలలకు పైగా శ్రమించారు. అందరి ఫోన్ నంబర్లు సేకరించి సమ్మేళనం ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది వరకు ఇక్కడికి హాజరయ్యారు. అనంతరం అప్పట్లో విద్యాబోధన చేసి గురువులు భాస్కర్‌రావు, శేషగిరిరావు, జగదీష్, చంద్ర నియోగి, ఎల్‌వీఎస్‌జీ ప్రసాదరావు, మోహన్‌రావు, వి సుబ్బారావు, రామచంద్రరావు, రఘుపతిరెడ్డి,వెంకటేశ్వర్లు, కృష్ణారావులను వీరంతా కలిసి ఘనంగా సన్మానించారు.
అంకిత భావంతో బోధించేవారు
అప్పట్లో గురువులు మాకు ఎంతో అంకితభావంతో బోధించేవారు. వారి మార్గదర్శకత్వంలో క్రమశిక్షణతో ఈ స్థాయికి చేరుకున్నాం. ఇన్ని సంవత్సరాల తర్వాత అప్పటి స్నేహితులను, గురువులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
- ఎమ్‌వీ రావ్, ఐఏఎస్, ఎన్‌ఎఫ్‌డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఎన్‌ఐఆర్‌డీ డెరైక్టర్ జనరల్
జ్ఞాపకాలు నెమరువేసుకున్నాం..
అప్పటి స్నేహితులను వారి కుటుంబ సభ్యులతో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత కలిసిన మేము అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాం. స్నేహ బంధాన్ని మించినది మరొకటి ఉండదు.
- ఎస్‌కే జానిమియా, క్రీసెంట్ డ్రగ్స్ అధినేత
శ్రమించి వివరాలు సేకరించాం;
స్నేహితులందరిని ఒక దగ్గర చేర్చడానికి రెండు నెలలు శ్రమించి వివరాలు సేకరించాం. అందరికి కలిసిన తర్వాత ఆ శ్రమంతా మర్చిపోయాం. ఎప్పటికీ ఈ సంతోషాన్ని మరచిపోలేం. ఇలాంటి కలయికలు తరచూ నిర్వహిస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
- దోసపాటి భాస్కర్‌రావు, బిజినెస్ మ్యాన్, కల్లూరు
అ‘పూర్వ’ సమ్మేళనం..
Published Mon, Dec 16 2013 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement