
గుంటూరు జీజీహెచ్
గుంటూరు మెడికల్: ఏళ్ల తరబడి ఫోకల్ సీట్లలో పనిచేస్తున్న వారిని మార్చి తమకు అవకాశం ఇవ్వాలని పదే పదే వినతి పత్రాలు అందించినా ఆస్పత్రి అధికారులు పట్టించుకోవటం లేదని జీజీహెచ్ కార్యాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రెండు నెలల కిత్రం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో కార్యాలయ సిబ్బంది సీట్లు మార్పు చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సదరు సీట్లు మార్పులు చేర్పులపై కార్యాలయ ఉద్యోగులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి సీట్లు మార్పులో అధికారులు పక్షపాతం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు సీట్లు మార్పు విషయంలో న్యాయం చేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని ఉద్యోగుల సంఘం నేతలు తెలియజేస్తున్నారు.
కొంత మంది జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల ద్వారా, మరికొంత మంది సెక్రటేరియట్, సీఎం క్యాంపు కార్యాలయం అధికారులచేత సీట్ల మార్పు కోసం ఆస్పత్రి అధికారులకు ఫోన్‌లు చేయించారన్నారు. రెగ్యులర్ సూపరింటెండెంట్‌లు, ప్రిన్సిపల్స్ నియామకానికి సీనియారిటీ జాబితా ఈ నెల 10వ తేదీన విడుదల చేశారు. మొత్తం 79 మంది సీనియర్ ప్రొఫెసర్స్‌తో సీనియారిటీ జాబితాను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ కె.బాబ్జి విడుదల చేశారు. అందులో ప్రస్తుతం ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజునాయుడు పేరు 77వ స్థానంలో ఉంది. ఈ నెలాఖరులోగా డీపీసీ ప్రకారం పదోన్నతులు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
దీంతో సూపరింటెండెంట్‌గా కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా తమకు ఇచ్చిన మాట ప్రకారం కార్యాలయ సీట్లు మార్పులు చేర్పులు చేయాలని పలువురు ఉద్యోగులు ప్రతి రోజూ సూపరింటెండెంట్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పదవీ విరమణ పెంపు జీవో, సూపరింటెండెంట్ సీటు కోసం సెక్రటేరియట్ చుట్టూ తిరిగిన సూపరింటెండెంట్ తమకు సెక్రటేరియట్ నుంచి రికమండేషన్ చేయించినా సీట్లు మార్పుచేయకుండా మిన్నకుండిపోతున్నారని కొందరు కార్యాలయ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సామాజిక వర్గంగా కొంతమంది ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నారని తమకు న్యాయం చేస్తామని ఏడాదిగా హామీ ఇచ్చిన అధికారులు నేడు మాట తప్పారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.
ఏడాదిగా అమలుకు నోచుకోని వైనం
జీజీహెచ్‌లో ఓ ఉద్యోగిని సీటు మార్పు చేసినా అతను సీటు మారకుండా అక్కడే ఏళ్ల తరబడి కొనసాగుతున్నారని కార్యాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అతడు సీటు మారకపోయినా సూపరింటెండెంట్ పట్టించుకోలేదని, మిగతా ఉద్యోగులకు ఇష్టం లేకుండా సీట్లు మార్పులు చేసి విధుల్లో చేరకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమన్యాయం చేయమని పలుమార్లు లిఖిత పూర్వంగా సూపరింటెండెంట్‌ను కోరినట్లు మినిస్టిరియల్ ఉద్యోగుల సంఘం నేతలు తెలిపారు. తాము సంఘం తరుపున కోరినప్పటికీ సమన్యాయం జరగకపోవటం వల్ల కార్యాలయ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు సంఘ నేతలు వెల్లడించారు. ఆస్పత్రి అధికారులు ఇకనైనా ఉద్యోగుల సంఘం నేతల వినతిని పరిశీలించి సీట్లు మార్పు విషయంలో సమన్యాయం చేయాలని ఉద్యోగుల సంఘం నేతలు కోరుతున్నారు.