
స్కూల్ బస్సు ప్రమాదం: బాలిక మృతి
మంగళగిరి (గుంటూరు): ఓ ప్రైవేటు స్కూల్ బస్సు రోడ్డుపై అడ్డంగా ఉన్న తాటిమొద్దును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్ కొత్తపాలెం గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. నోటకి గ్రామంలో ఉన్న విజ్ఞాన్ విహార్‌కు చెందిన స్కూల్ బస్సు కొత్తపాలెం, శృంగవరపుపురం గ్రామాల నుంచి 30 మంది విద్యార్థులతో బయలుదేరింది.
నూతక్ కొత్తపాలెం గ్రామాల మధ్య రోడ్డుపై అడ్డంగా వేసిన తాటిమొద్దును బస్సు ఢీ కొట్టింది. తాటిమొద్దు బస్సులోకి దూసుకొని రావడంతో లహరి(8) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. బస్సులో ఉన్న మిగతా విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకొని తమ పిల్లలను తీసుకొని వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.