'సమైక్యంపై హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా'
హైదరాబాద్ : సమైక్యవాదం కోసమే తాను రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి చైతన్య రాజు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇస్తే పోటీనుంచి తప్పుకుంటానని కూడా ఆయన ప్రకటించారు. అయితే సమైక్యవాద తీవ్రతను అధిష్టానానికి తెలియజెప్పేందుకు చైతన్యరాజుకు మద్దతిస్తున్నట్టు చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.
చైతన్య రాజు అభ్యర్థిత్వాన్ని సీమాంధ్ర మంత్రులు కాసు వెంకట కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్, గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బలపరిచారు. విశాఖ ఎంఎల్‌ఏలు..రమణమూర్తి రాజు, వెంకటరామయ్య, అవంతి శ్రీనివాస్, రమేష్, ముత్యాలపాప బలపరిచారు.
చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని బలపరిచినంత మాత్రాన తాము కాంగ్రెస్ పార్టీకి.. ఆపార్టీ అభ్యర్థులకు వ్యతిరేకం కాదని ఆయన వివరించారు. మరోవైపు.. రాజ్యసభకు రెబెల్‌గా పోటీచేసే యోచనలో ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. పోటీలోకి దిగద్దని.. చైతన్యరాజు మద్దతుదారులు ..ఆదాలను వారిస్తున్నా.. నామినేషన్లు వేయడానికే ఆదాల సిద్ధమవుతున్నారు. రెబెల్ అభ్యర్థిగా ఒకరు మాత్రమే రంగంలో ఉంటే గెలుపుకు ఆస్కారం ఉన్నందున ఆఖరి నిమిషంలో జేసీ పోటీనుంచి వెనక్కు తగ్గారు.