చివరి నిమిషంలో జేసీ విత్ డ్రా
హైదరాబాద్ : అధిష్టానాన్ని ధిక్కరించి అయినా రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధపడ్డ మాజీమంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అధిష్టానం తనను ఎంపిక చేయకపోయినా పోటీ చేసి తీరాతానంటూ హంగామా చేసిన జేసీ హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని తనకు రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించిన టి సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు ఫోన్ చేసినట్లు జేసీ పేర్కొనటం విశేషం.
కాగా కోస్తా ఆంధ్రా ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ చైతన్యరాజు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన మంగళవారం ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. చైతన్యరాజుకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతు పలికారు. కాగా రెబల్‌గా పోటీలోకి దిగేందుకు చైతన్యరాజు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పోటీ పడిన విషయం తెలిసిందే.
అయితే రాయలసీమ నుంచి జేసీ దివాకరరెడ్డి పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ సీమాంధ్ర నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు చైతన్యరాజు వైపు మొగ్గు చూపారు. మరోవైపు టీఆర్ఎస్ తరపున కేశవరావు నామినేషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ఇచ్చింది. కాగా కేవీపీ రామచంద్రరావు, టీ సుబ్బరామిరెడ్డి, ఎంఏ ఖాన్లకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈరోజు గాంధీభవన్లో బీఫారమ్లు అందించారు. పార్టీకి చేసిన సేవకు గుర్తింపుగానే సోనియా ముగ్గురికి టిక్కెట్లు ఇచ్చిందని బొత్స తెలిపారు.
ఇక టీడీపీ తరపున పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తోట సీతామహాలక్ష్మి, గరికపాటి మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు వారు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.