కాంగ్రెస్‌లోనే మరణిస్తానన్న కేవీపీ
వైఎస్ పాదయాత్ర వల్లే కాంగ్రెస్ నేటికీ పరిపుష్టిగా ఉందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘నన్ను గాంధీభవన్లోకి రానీయొద్దని కొందరు ప్రయత్నించారు. కానీ నాకు గాంధీభవనే దేవాలయం. కాంగ్రెస్‌లోనే చివరి వరకూ ఉండి మరణిస్తా’ అని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ‘‘నేను కాంగ్రెస్‌లో కొనసాగుతానో, లేదోనంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. 1964 నుంచి ఇప్పటివరకు నాకు కాంగ్రెస్‌తో అనుబంధముంది. కష్టసుఖాలు అనుభవించాను. ప్రతిష్ట, అప్రతిష్టలూ మూటగట్టుకున్నాను. అనేకమంది సీనియర్లతో కలసి పనిచేశాను. పార్టీ కోసం కష్టపడి పని చేశాను. అయినా నన్ను చెడ్డవాడిగానే ప్రచారం చేశారు’’ అంటూ గతాన్ని నెమరేసుకున్నారు. కేవీపీతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి, ఎంఏ ఖాన్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికవడం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శనివారం గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీ భావోద్వేగంతో మాట్లాడారు. తాను ఏనాడూ పార్టీకి వ్యతిరేకంగా నడవలేదని, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రోజుల్లో తాను ఇందిర వెంటే నడిచానని అన్నారు.
‘‘పీవీ నర్సింహారావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, అంజయ్య వంటి మహామహులకే గాకుండా ఇప్పుడున్న ఎందరో నేతలకు బీ ఫారాలు అందించే అదృష్టం నాకు కలిగింది. పీసీసీ అధ్యక్షుడిగా వైఎస్ 1983లో బాధ్యతలు స్వీకరించాకే అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని గాంధీభవన్‌ను అభివృద్ధి చేశారు. 1983లో వైఎస్ పీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచీ ఆయన వెన్నంటే నడిచాను. కాంగ్రెస్ నేటికీ పరిపుష్టంగా ఉందంటే అందుకు వైఎస్ పాదయాత్ర కూడా కారణం. ఆ పాదయాత్ర చెడ్డ పని అన్నట్టుగా అడ్డంకులు సృష్టించారు. కానీ నాటి పీసీసీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు ఎంతో సహకరించారు. బొత్స, ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్‌తో సహ పలువురిని విద్యార్థి యువజన దశ నుంచే ప్రోత్సహించాను. వారు రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగడంలో నా పాత్ర ఉంది. మంత్రి శ్రీధర్‌బాబును మేనల్లుడిలా చూసుకున్నా.
వి.హన్మంతరావు, చిన్నారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి వారు పెద్ద స్థాయిలోకి రావడానికి తోడ్పడ్డాను.దానం నాగేందర్ పార్టీని వీడినా, పొన్నం ప్రభాకర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసి సస్పెండైనా వారిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చి మంత్రులుగా, ఎంపీలుగా చేశాం. 1996 నుంచీ రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించాను. ఫలించకపోయినా నిరాశా నిస్పృహలకు లోనవలేదు. 1989 నుంచి 1995 వరకు మా నిర్ణయాల వల్ల పార్టీకి కొన్ని నష్టాలు జరగడం నిజమే గానీ అందుకు కారణంగా మాకు తెలియకుండా జరిగిన తప్పులే. 2009లో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 10 లోక్‌సభ స్థానాలు కూడా రావని అధిష్టానం భావిస్తే మేం 33 స్థానాలు తీసుకురాగలిగాం. వైఎస్ హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. కాంగ్రెస్‌ను స్తబ్ధత, నిరాశ ఆవ రించాయి’’ అని గుర్తు చేసుకున్నారు. ‘ఇంత కష్టపడ్డా నాకు రెండోసారి రాజ్యసభ సీటు రాకుండా చేసేందుకు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి’ అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురించి ఏదో చెప్పబోతూ ఆగిపోయారు. అంతలోనే, ‘ఈ సమయంలో వ్యతిరేక భావాలెందుకు? అన్నీ మంచి విషయాలే మాట్లాడతాను. సీఎం కిరణ్ కూడా నాకు మనస్ఫూర్తిగా సహకరించారు’ అని పేర్కొన్నారు. వైఎస్ చివరి కోరిక ప్రకారం రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యేలా సహకరిస్తానన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గురించి అధిష్టానానికి చెప్పామని, వారే చర్య తీసుకుంటారని బొత్స అన్నారు.