కోయిల్‌కొండ, న్యూస్‌లైన్: యువత మార్పు కోసం అవినీతిరహిత సమాజ నిర్మించుకునేందుకు బీజేపీకి మద్దతు పలకాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అవినీతి కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. నారాయణపేట నియోజకవర్గంలోని కోయిలకొండలో జరిగిన ‘బీజేపీ యువగర్జన’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 2014లోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అత్యధిక అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్నారు. ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి రాగానే నిత్యావసర, విద్యుత్ చార్జీవిద్యుత్ అదుపులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యువతరం మద్దతు ఉంటే బీజేపీ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతోందని, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి నాగం జనార్దన్‌రెడ్డి, నారాయణపేట అసెంబ్లీ నుంచి రతంగ్‌పాండురెడ్డి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. నారాయణపేటలో నాలుగుసార్లు పోటీ చేసిన నాగూరావు నామోజీ ఈ సారి తప్పుకుని పాండురెడ్డికి అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు.
సేవ చేసేందుకే రాజకీయాలు
రాజకీయాలు ప్రజాసేవ చేసేందుకే కానీ ప్రజల సొమ్మును దోచుకునేందుకు కాదని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దర్‌రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలే కాంగ్రెస్ పార్టీకి చివరివని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవ డానికి సీఎం కిరణ్ కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించి, సీమాంధ్రకు చెందిన వ్యక్తికి కట్టబెట్టారని మండిపడ్డారు. గ్రామీణ స్థాయిలో పడుతున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి యువత ముందుకు వస్తోందన్నారు.
బీజేపీ వైపే ప్రజల చూపు: యెన్నం
ప్రజలందరూ బీజేపీ వైపే చూస్తున్నారని, అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు పాకులాడుతున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో టీడీపీతో పెట్టుకుని బీజేపీ చాలా నష్టపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క తెలంగాణలోనే తాము 72 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతామని జోస్యం చె ప్పారు.
జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి మాట్లాడుతూ జిల్లా వెనకబాటుకు పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. సభలో ఆ పార్టీ నేతలు నాగూరావు నామోజీ, శ్రీవర్ధన్‌రెడ్డి, పడాకుల బాలరాజు, పడాకుల రామచంద్రయ్య, రాములు, కృష్ణయ్య, ఆంజనేయులు, శ్రీధర్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో 60 మంది ఆటో యూనియన్ నాయకులు కిషర్‌రెడ్డి, నాగం సమక్షంలో బీజేపీలో చేరారు.
మద్దతు ఇవ్వండి
Published Fri, Jan 3 2014 3:46 AM | Last Updated on Fri, Mar 29 2019 5:35 PM
Advertisement
Advertisement