అక్కడి నుంచి ఇక్కడకు వెళ్లే ఫలానా నెంబర్ రైలు.. ఇన్ని గంటలకు ఇన్నో నెంబర్ ఫ్లాట్‌ఫ్లాంపైకి వస్తుందని ముందస్తు సమాచారమిచ్చి ప్రయాణికులను అప్రమత్తం చేసే రైల్వేశాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల విషయంలో మాత్రం ప్రమత్తంగా వ్యవహరిస్తోంది. లక్షల్లో ప్రయాణికులు వస్తారని భావిస్తున్న కొవ్వూరు రైల్వేస్టేషన్‌లో అవసరమైన స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదు. తూతూమంత్రంగా నిధులు విదిల్చి తాత్కాలిక తంత్రంతో బయట పడే మార్గంలో పయనిస్తోంది. అసలే అరకొర నిధులతో నిర్వహిస్తున్న పనులను ఆలస్యంగా ప్రారంభించింది. ఇప్పటికే స్టేషన్‌లో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ వంటి కనీస సదుపాయాలు కొరవడ్డాయి. వాటిని పునరుద్ధరించి పైపై మెరుగులద్దేలోపే పుణ్యకాలం కాస్తా కరిగిపోయేలా ఉంది.
కొవ్వూరు :గోదావరి పుష్కరాలకు కొవ్వూరు రైల్వేస్టేషన్ ఆదరాబాదరాగా ముస్తాబవుతోంది. మరో నెలరోజుల్లో మహాపర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే ప్రయాణికులకు సౌకర్యాల కల్పించేందుకు రైల్వే శాఖ దృష్టి సారించింది. అయితే కేవలం తాత్కాలిక పనులతోనే సరిపెట్టనుంది. జిల్లాలో ప్రధానమైన కొవ్వూరు, నరసాపురంతో పాటు నిడదవోలు రైల్వేస్టేషన్‌లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. పుష్కర సమయంలోనైనా వీటికి మోక్షం లభిస్తుందని జనం భావించారు. కొవ్వూరు స్టేషన్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని రైల్వేమంత్రిని కోరానని పెద్దఎత్తున సొమ్ములు రానున్నాయని ఎంపీ మాగంటి మురళీమోహన్ చాలాసార్లు ప్రకటించారు. అయితే ఆచరణకు వచ్చేసరికి ఆశించిన స్థాయిలో రైల్వే శాఖ కొవ్వూరుకి నిధులు విదల్చలేదు. ప్రయాణికులు నిత్యం అసౌకర్యాలతో అవ స్థలు పడుతున్నప్పటికీ రైల్వే శాఖ ఈ మూడు స్టేషన్లలో సదుపాయాల మెరుగు పరచడంపై దృష్టి సారించలేదు. కొవ్వూరులో 50 మీటర్ల సిమెంట్ రోడ్డు, 60 మీటర్ల షెడ్ల ఏర్పాటు తప్ప శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన పనులు ఏమీ లేవు.
చేపడుతున్న పనులు ఇవే
రైల్వేస్టేషన్‌లోకి వికలాంగులైన ప్రయాణికులను తీసుకువెళ్లడానికి అనువుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్టేషన్ కార్యాలయ భవనం పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షాకాలంలో నీరుకారుతోంది. పెచ్చులూడి అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం పైకప్పు రంధ్రాలకు సిమెంటు పూసి రంగులు వేస్తున్నారు. ప్రయాణికుల విశ్రాంతి నిమిత్తం రెండు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులు వేచి ఉండేందుకు రెండో ప్లాంట్‌ఫాంపై 60 మీటర్ల పొడవున ఐదు చిన్నచిన్న రేకుల షెడ్లు నిర్మించారు. వాటిలో సిమెంటు బల్లలు, దిమ్మలను ఏర్పాటు చేయనున్నట్టు రైల్వేశాఖ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఆఫ్ వర్క్స్ కె.ప్రసాద్ తెలిపారు.
ఒకటవ ప్లాట్‌ఫాం చివరన సుమారు 50 మీటర్ల పొడవున సిమెంటు రోడ్డును నిర్మిస్తున్నారు. అదనంగా మరో ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తున్నారు. టాయిలెట్స్, నీటి సరఫరా వంటి ఏర్పాట్లు చేయనున్నారు. దీనికోసం సుమారు రూ.50 లక్షలు వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం వేసిన ఐదు చిన్న షెడ్లలో వర్షం వస్తే ప్రయాణికులు తడిసిపోవాల్సిందే. తక్కువ వెడల్పు ఉండడం వల్ల జల్లు కొట్టే అవకాశం ఉంది. అదే గతంలో నిర్మించిన షెడ్లు మాదిరిగా ఏర్పాటు చేస్తే కొంతమేరకు ప్రయాణికులకు ఉపయోగంగా ఉండేవి. ఆలస్యంగా ప్రారంభించడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నేటికీ ఎక్కడి సమస్యలు అక్కడే
కొవ్వూరు స్టేషన్‌లో 650 మీటర్లు పొడవున మూడు ఫ్లాట్‌ఫాంలుండగా కేవలం 100 మీటర్ల దూరం మాత్రమే షెడ్లు ఉన్నాయి. ఇప్పుడు మరో 60 మీటర్ల పొడవుతో షెడ్లు నిర్మిస్తున్నారు. ప్రయాణికులు వేచి వుండేందుకు ఒకే విశ్రాంతి గది ఉంది. నిత్యం 12 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 20 పాసింజర్ రైళ్లు ఇక్కడ ఆపుతారు. సాధారణ రోజుల్లో సరాసరి మూడు వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. పుష్కరాల సమయంలో దీనికి పది రెట్లు ప్రయాణికులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ ప్లాట్‌ఫాంపైనా తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ఇప్పటికేప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఒకటవ ప్లాట్‌ఫాంపై రెండు, రెండో ప్లాట్‌ఫాంపై నాలుగు మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ నిర్వహణ లోపం కారణంగా నిరుపయోగంగా ఉన్నాయి. రన్నింగ్ వాటర్, విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులకు అక్కరకు రావడం లేదు.
కొవ్వూరు స్టేషన్‌లో ప్రహరీ కొంతమేరకు
కూలిపోయింది. గోడ పక్కనే చెత్త పారబోయడంతో అపరిశుభ్రత నెలకొంది. ప్రహరీ నిర్మించి,
చెత్తను తరలించాల్సిన అవసరం ఉంది. ఈ పనులన్నింటిని కేవలం నెలరోజుల వ్యవధిలో పూర్తి చేయడం కష్టమయ్యేలా కన్పిస్తోంది. ఎందుకంటే రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పనులు చే పట్టడానికి ఆటంకం ఏర్పడవచ్చు. కొవ్వూరుకి చేరువలో ఉన్న పశివేదల, చాగల్లు, బ్రాహ్మణగూడెం స్టేషన్లలో కనీస సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి ప్రస్తుతం పార్కింగ్‌కి వినియోగిస్తున్న షెడ్‌లో పుష్కరాలకు తాత్కాలిక బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కింగ్ షెడ్ పక్కనే ప్రయాణికుల విశాంత్రి కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర సమయంలో పార్కింగ్ ఉండదని అధికారులు చెబుతున్నారు. వేలల్లో వచ్చే ప్రయాణికుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయకపోతే వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రైల్వేస్టేషన్ సమీపంలో విశాలమైన ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో తుప్పలు తొలగించి పార్కింగ్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు అవస్థలు తప్పుతాయి.
ఆదరాబాదరా ముస్తాబు
Published Fri, Jun 12 2015 12:42 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement