ఒంగోలు కల్చరల్ : గోదావరి పుష్కరాలకు ఆంక్షల సంకెళ్లు పడ్డాయి. జిల్లా నుంచి వెయ్యి మందికి తగ్గకుండా ఉచితంగా తీసుకువెళతామని ప్రకటించిన యంత్రాంగం రోజులు దగ్గరపడే కొద్దీ కోత విధిస్తూ వస్తోంది. ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభం అవుతున్నప్పటికీ ఇప్పటికీ స్పష్టంగా విధానాలను ఖరారు చేయలేదు. గోదావరి పుష్కర శోభాయాత్రలో పాల్గొని జన్మధన్యం చేసుకుందామని ఆశించిన అనేక మందిపై అక్కడకు వెళ్లకుండానే వారి ఆశలపై జిల్లా యంత్రాంగం నీళ్లు చల్లింది.
రోజుకో రకమైన ప్రకటనలు ఇస్తూ గందరగోళానికి గురిచేస్తుండటంతో అనేక మందికి యాత్రకు వెళ్లాలని ఉన్నప్పటికీ ఆ ఆలోచనను బలవంతంగా విరమించుకోవడం గమనార్హం. వయో పరిమితి పేరిట విధించిన ఆంక్షల సంకెళ్లు కూడా పుష్కర యాత్రపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. జిల్లా నుంచి వెయ్యిమంది భక్తులతో రాజమండ్రికి శోభా యాత్ర నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం ముందుగా ప్రకటించింది. ఈ యాత్రలో పాల్గొనేందుకు 700 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 40 ఏళ్లు దాటినప్పటికీ ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలులేని వారు కూడా ఉన్నారు. వారిలో అతికష్టంగా 500 మందిని ఎంపిక చేశారు.
అందుకోసం 10 బస్సులు అవ సరం అవుతాయంటూ ఏర్పాట్లు చేసింది. 500 మంది భక్తులు ఎప్పుడెప్పుడు గోదావరి పుష్కరాలకు వెళతామని ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో ఆ సంఖ్యను కూడా కుదించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 40 ఏళ్లకు పైబడిన వారిని యాత్రకు అనర్హులుగా ప్రకటించేసింది. దీంతో జిల్లా నుంచి 300 మందికే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పుష్కర శోభాయాత్రలకు అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటం, నిధులకు కొరత లేకపోయినప్పటికీ జిల్లా యంత్రాంగం మరింత ఉత్సాహంగా భక్తులను తరలించాల్సిందిపోయి రోజులు దగ్గరపడేకొద్దీ సంఖ్యను కుదించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
యాత్ర వేదికకు తప్పని మార్పు
జిల్లా నుంచి పుష్కరాలకు వెళ్లే వారిని ఒకే క్రమంలో తీసుకువెళ్లేందుకు వీలుగా ఒంగోలులో యాత్ర వేదికకు కూడా మార్పు తప్పలేదు. ముందుగా ఈ యాత్రను ఒంగోలులోని మినీ స్టేడియం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. చివరకు అదికాస్తా ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంకు మారింది. పవిత్ర పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక క్రమపద్ధతిలో ఆధ్యాత్మిక ఔన్నత్యం వెల్లివిరిసే విధంగా రూపొందించాల్సిన జిల్లా యంత్రాంగం అభాసుపాలైంది.
గోదావరి పుష్కరాలకు ఆంక్షల సంకెళ్లు
Published Sun, Jul 12 2015 2:14 AM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM
Advertisement
Advertisement