
కస్టమ్స్ అదుపులో బంగారం స్మగ్లర్ సుజాత్ అలీ
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న సూత్రధారుల్లో కీలకవ్యక్తి సుజాత్ అలీని కస్టమ్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వ్యవస్థీకృత బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న సూత్రధారుల్లో కీలకవ్యక్తి సుజాత్ అలీని కస్టమ్స్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. బుధవారం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ 13 కేజీల బంగారంతో చిక్కిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌హోస్టెస్ సదాఫ్ ఖాన్ వెనుక ఇతడే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి బుధవారం సదాఫ్ వెంట సుజాత్ అలీ కూడా ఉన్నాడు. ఆమెను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో జారుకుని నేరుగా దుబాయ్ పారిపోయాడు.
ఈ విషయం పసిగట్టిన కస్టమ్స్ అధికారులు దుబాయ్ విమానాశ్రయ అధికారుల సాయంతో సుజాత్‌ను పట్టుకుని తిరిగి హైదరాబాద్‌కు రప్పించి అదుపులోకి తీసుకున్నారు. చైనా కేంద్రంగా పని చేస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ ముఠాతో ఇతడికి లింకులు ఉన్నాయని అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నికల ఖర్చులకు, బంగారం స్మగ్లింగ్‌కు మధ్య ఉన్న లింకులతోపాటు దీని వెనుక ఉన్న హవాలా ముఠాల వివరాలనూ సేకరిస్తున్నారు. మరోవైపు బుధవారం పట్టుబడిన సదాఫ్ ఖాన్, ఫాతిమాలను కస్టమ్స్ అధికారులు గురువారం నాంపల్లిలోకి ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు నిమిత్తం కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు.