కొవ్వాడ గ్రామం
అధికార పార్టీ నేతల బంధువులు రాబందుల అవతారమెత్తారు. నాలుగేళ్లుగా సాగుతున్న దోపిడీ పర్వంలో కొత్త అంకానికి తెర తీశారు. మాయోపాయాలతో పేదలకు అందాల్సిన అణు పరిహారం సొమ్మును గుటకాయ స్వాహా చేశారు. డబ్బు కాజేయడానికి అధికారుల నుంచి అగ్ర నాయకుల వరకు అందరినీ సమయానుకూలంగా వినియోగించుకున్నారు.
రణస్థలం: తెలుగుదేశం పాలనలో దోపిడీల పర్వం కొనసాగుతోంది. ఎక్కడ అభివృద్ధి పనులు జరిగితే అక్కడ అధికార పార్టీ నాయకుల అక్రమాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తాజాగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పరిహారం స్వాహా చేసిన అంశంలోనూ టీడీపీ నేతల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బినామీల రూపంలో నాయకులు, వారి బంధువులే రాబందులై పరిహారం తినేసినట్లు సమాచారం.
అణు విద్యుత్ భూ సమీకరణ విస్తీర్ణం
అణు విద్యుత్ భూ సేకరణలో భాగంగా 2,348 ఎకరాలు అవసరం కాగా ఇందులో ప్రభుత్వ భూమి 763.51 ఎకరాలు, గ్రామ కంఠం 52.89 ఎకరాలు, అసైన్డ్ భూమి 495.76 ఎకరాలు, జిరాయితీ 604.11 ఎకరాలు, టౌన్ షిప్ 372 ఎకరాలు, డిప్లేస్డ్ ల్యాండ్ 150ఎకరాలు ఉంది.
రాత్రికి రాత్రే..
కొవ్వాడ అణు పరిహారం ప్రక్రియలో ఆక్రమిత భూములకు కూడా పరిహారం అందిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో ఎప్ప టి నుంచో పేదలు సాగు చేస్తుండడంతో వారికి కూడా పరిహారం అందించాలని నిర్ణయించారు. దీన్ని అదనుగా తీసుకున్న అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెర తీశారు. మండల కేంద్రంలోని ఓ మీ సేవా కేంద్రం వద్ద రాత్రికి రాత్రి అక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేశారు. రెవెన్యూ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమిలో ఖాళీల వివరాలు తెలుసుకుని తమ కుటుంబాల పేరున అణు సర్వేలో గెడ్డలు, వాగులు, కొండ పోరంబోకు భూములు అని తేడా లేకుండా నమోదు చేయించుకున్నారని సమాచారం. పరిహారం జాబితాలో వీరి పేర్లు చూసి రైతులు ఎంతగా మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరకు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
నాయకుల బంధువులే..
అధికార పార్టీకి చెందిన రణస్థలం మండల ఎంపీపీ గొర్లె విజయకుమార్, గొర్లె లక్ష్మణరావు, మైలపల్లి వెంకటేష్, సుంకరి ధనుంజయ వీరితోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీకే రాఘవన్‌ల పేర్లు ఈ అవినీతి బాగోతంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పరిహారం వ్యవహారంలో వీరి జోక్యంపై మితిమీరుతోందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. బంధువులు, సన్నిహితులు, నౌకర్ల పేరుతో పత్రాలు సృష్టించి పరిహారం కాజేసినట్లు తెలిసింది. నాలుగు విడతల్లో అందించిన 700 మంది గల పరిహార రైతుల జాబి తాలో 65 శాతం మంది అనర్హులేనని, వీరంతా అప్పటికప్పుడు పత్రాలు పట్టుకుని వచ్చిన వారేనని మండలం మొత్తం కోడై కూస్తోంది. ఇప్పటి వరకు 700 ఎకరాల వరకు పరిహారం అందజేశారు.
గొర్లె విజయకుమార్ టీడీపీ ఎంపీపీ: తప్పుడు పత్రాలతో బినామీలకు ఇచ్చిన భూములు 87.50 ఎకరాలు. జీరుకొవ్వాడ గ్రామ రెవెన్యూలో సర్వే నంబర్ 67–1 నుంచి 67–30వరకు çసర్వే నంబర్ 43–81నుంచి 43–97వరకు కుటుంబసభ్యుల పేరున 87.50 ఎకరాలు.
గొర్లె లక్ష్మణరావు: మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ప్రస్తుత టీడీపీ నాయకులు. ఈయన దాదాపు 32 ఎకరాలకు తనవారి పేరిట తప్పుడు పత్రాలు సృష్టించారు. దానికి పరిహారం కూడా అందుకున్నట్లు సమాచారం.
వీకే రాఘవన్: (తూర్పు గోదావరి జిల్లా వాసి) టెక్కలి గ్రామ రెవెన్యూలో 6.74 ఎకరాలు, బినామీల పేర్లతో పోరంబోకు భూమి సుమారు 45.23 ఎకరాలకుపైగా ఆక్రమించాడు.
రుక్మిణి అగ్రికల్చరల్ ప్రైవేటు లిమిటెడ్, విజయ్ మిట్టల్ పేరున 18.28 ఎకరాలు పోరంబోకు భూమిని ఆక్రమణ భూమిగా నమోదు చేశారంటే రెవెన్యూ యంత్రాంగం ఎంత బాగా పనిచేస్తోందో అర్థమవుతుంది. ఇవే కాక ఈ భూములను అతని అనుచరులను బినామీలుగా సృష్టించి పరిహారం కాజేశారు. ఈ నలుగురి చేతిలో సుమారు 183 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. మొత్తం అక్రమాల్లో పాల్గొన్న వారి చేతిలో రెండు వందలకుపైగా ఎకరాలు ఉన్నట్లు తెలిసింది. ఈ భూమికి అందించే పరిహారం మొత్తం నాయకుల చేతికే వెళ్తుంది.
పార్టీలోకి వస్తేనే పరిహారం..
అల్లివలస ఎంపీటీసీ, కోటపాలెం సర్పంచ్‌లు అణు భూములను బినామీలు, బంధువుల పేర్లతో గత సర్వేలోనే నమోదు చేయించుకున్నారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తొలుత కోటపాలెం సర్పంచ్ ఎస్.ధనుంజయ, తర్వాత అల్లివలస ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు టీడీపీ కండువా కప్పుకున్నారు.
కళా సంతకం పెడితే..
అణు పరిహార జాబితాలో పేరు, భూముల రికార్డులు సి ద్ధంగా ఉన్నా అణు పరిహారం అందాలంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు గ్రీన్ కలం తో సంతకం పెట్టాలి. ఆ వెంటనే టీడీపీ నాయకులకు ప రిహారం అందిపోతుంది. దీనిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం తాము ప్రయాస పడుతుంటే ఇలా చేయడం తగదంటున్నారు.
వలస వచ్చినోడికి పరిహారం
మా తండ్రి పేరున సర్వే నంబర్ 24–6 సబ్ డివిజన్ 23లో 1.21 ఎకరాల డీపట్టా భూమి ఉంది. ఆ భూమిని తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇక్కడకు పనికోసం వచ్చిన వీకే రాఘవన్ పేరిట ఆక్రమణ భూమిగా నమోదు చేశారు. సమాచార సేకరణ చట్టం ద్వారా పత్రాలు సేకరించాను. బ్యాంకులో లోను మంజూరు చేసిన పత్రాలు కూడా చూపించినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో తప్పక న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది.
– యతిరాజ్యం అప్పలరాజు, బాధితుడు
పరిశీలనలో లేదు..
అణు పరిహారంలో 1473 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే అందులో 512 ఎకరాలు ఆక్రమణదారులకు, 188 ఎకరాలు వరకు డీపట్టాదారులకు ఇప్పటివరకు పరిహారం చెల్లించాం. 80 ఎకరాలు నాన్ రెసిడెన్సీ, ఐదు ఎకరాలు మించిన వారు ఉన్నారు. 25 ఎకరాలు న్యాయస్థానంలో ఉంది. 30 ఎకరాలు పరిశీలనలో ఉంది. మరో 600 ఎకరాల ఖాళీ స్థలం ఉంటే అందులో గెడ్డలు వాగులు 170 ఎకరాలు ఉన్నాయి. బినామీలు, బంధువులు అనేది మా పరిశీలనలో లేదు. ఆధార్ అనుసంధానం చేసి పరిహారం చెల్లిస్తున్నాం.
– కె. శ్రీరాములు, తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment