
టీడీపీని అధికారంలోకి తెచ్చిన వారికి మంచి పోస్టింగులు: మంత్రి అయ్యన్న
వివిధ జిల్లాల్లో జరిగిన తెలుగుదేశం మినీ మహానాడుల్లో మంత్రులు గాడి తప్పి మాట్లాడారు. తమ రాజకీయ కోణాన్ని బయటపెట్టి అందర్నీ భయపెట్టారు.
సాక్షి, విశాఖపట్నం: కార్యకర్తల కోసం పనిచేసేవారిని తెచ్చుకునేందుకే తమ ప్రభుత్వం బదిలీలు చేపట్టిందని రాష్ర్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల్లో సహకరించిన అధికారులకు మంచి పోస్టింగ్‌లిస్తామని, కార్యకర్తల కోసం పనిచేసే వారిని ఏరికోరి తెచ్చుకుంటామన్నారు. విశాఖపట్నంలోని అంకోసా ఆడిటోరియంలో ఆదివారం జరిగిన టీడీపీ జిల్లా మినీ మహానాడులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల బదిలీలన్నీ తమ సౌలభ్యం కోసమేనని, పరిపాలనా సౌలభ్యం కోసం కాదన్నారు. అధికారంలోకొచ్చాక కార్యకర్తల కోసం పనిచేసుకోకపోతే ఎలా ? అని ప్రశ్నించారు. ‘మా పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. అక్రమ కేసులు బనాయిస్తే జైలుకెళ్లారు. వారికోసం పనులు చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. పత్రికలు రాస్తే రాసుకోనీయండి..మా పని మాదే..పత్రికల పని పత్రికలదే. ఆ రాతల్ని పట్టించుకోనవసరం లేదు’ అని అన్నారు.
కార్యకర్తలు చెప్పింది చేయాలి: అచ్చెన్న
శ్రీకాకుళం అర్బన్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చెబితే అధికారులు అదే చేయాలని కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఆదివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004కు ముందు ప్రభుత్వంతో సమానంగా పార్టీని నడపనందునే ఓటమిపాలయ్యామన్నారు.ప్రతీ సంక్షేమ పథకంపై కార్యకర్తల ముద్ర ఉండేలా చూస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో జరిపిస్తానన్నారు.
కార్యకర్తలను గౌరవించాలి: గంటా
కడప రూరల్ : టీడీపీ కార్యకర్తలు న్యాయసమ్మతంగా చెప్పింది అధికారులు చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం కడప మినీ మహానాడులో మాట్లాడారు. కార్యకర్తలు కార్యాలయాలకొస్తే గౌరవంతో చూడాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.