టెక్కలి: లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఉన్న టెక్కలికి చెందిన గోపీకృష్ణను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలిలో నివాసముంటున్న గోపీకృష్ణ తల్లిదండ్రులు వల్లభనారాయణరావు, సరస్వతిలను ఆదివారం ఆయన ఓదార్చారు. నేరుగా ఢిల్లీకి ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు. గోపీకృష్ణను ఉగ్రవాదుల నుంచి విడిపించేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నామని ఎలాంటి భయాందోళనలూ చెందవద్దని బాధిత తల్లిదండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లిబియాలో ఉగ్రవాదుల కిడ్నాప్‌కు గురైన గోపీకృష్ణను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఇండియా ఎంబసీ అధికారులతో మాట్లాడి లిబియా దేశం ప్రతినిధులతో చర్చలు జరిపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఆయనవెంట ఎల్.ఎల్.నాయుడు, హనుమంతు రామకృష్ణ, చాపరా గణపతి, మామిడి రాము తదితరులు ఉన్నారు.
అండగా ఉంటాం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునా అండగా ఉంటామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని గోపీకృష్ణ తల్లిదండ్రులకు వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. గొల్లవీధిలో ఉంటున్న గోపీకృష్ణ తల్లిదండ్రులైన వల్లభనారాయణరావు, సరస్వతిల ఇంటికి వెళ్లి వారిని ఓదార్చారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న గోపీకృష్ణ విడుదలకు ప్రభుత్వం స్పందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు ఎ.తాతారావు, విశ్వనాథం, గోపీ తదితరులు పరామర్శించారు.
గోపీకృష్ణ విడుదలకు చర్యలు
Published Mon, Aug 3 2015 1:47 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement
Advertisement