మహిళల భద్రత మన బాధ్యత | Goutam Sawang Says That Safety of women is our responsibility | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత మన బాధ్యత

Published Mon, Mar 9 2020 3:51 AM | Last Updated on Mon, Mar 9 2020 3:52 AM

Goutam Sawang Safety of women is our responsibility - Sakshi

ఆదివారం గుంటూరులో అర్బన్‌ దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, అమరావతి: ‘మహిళల భద్రత మన బాధ్యత’ అనే నినాదంతో 2020ని మహిళా భద్రత సంవత్సరంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీసులంతా పని చేయాలని డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరులో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఇప్పటికే ప్రారంభించిన 6 పోలీస్‌ స్టేషన్లతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 18 దిశ స్టేషన్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌తో కలిసి రాష్ట్రంలోని 967 పోలీస్‌ స్టేషన్ల సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పోలీస్‌ కుటుంబ సభ్యులు, గ్రామ మహిళా సంరక్షణ అధికారులు, మహిళా మిత్రలు, విద్యార్థులతోనూ ముచ్చటించారు. 

వీడియో కాన్ఫరెన్స్‌లో ఏమన్నారంటే..
- మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడంలో మనమంతా కీలక పాత్ర పోషించాలి. 
- పోలీస్‌ స్టేషన్లకు మహిళలు నిర్భయంగా వచ్చి బాధలు చెప్పుకునే పరిస్థితి కల్పించాలి.
- దిశ యాప్‌ను ప్రతి మహిళా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చైతన్యం తీసుకురావాలి.
- మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు నవ శకానికి నాంది.
- మనమంతా సమన్వయంతో కొత్త స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగితేనే దిశ చట్టానికి సార్ధకత చేకూరుతుంది.

మీడియాతో మాట్లాడుతూ..
- స్థానిక ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణకు సర్వసన్నద్ధంగా ఉన్నాం.
- ఇప్పటికే ఎస్పీలతో రెండు పర్యాయాలు సమావేశం నిర్వహించి అవసరమైన ఆదేశాలు ఇచ్చాం.
- దిశ బిల్లులో భాగంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
- ల్యాబ్‌లలో సాంకేతిక పరిజ్ఞానం, డీఎన్‌ఏ పరీక్షలకు అవసరమైన ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు ఏపీ పోలీస్‌ బృందం ఇప్పటికే గుజరాత్‌లో పర్యటించి అధ్యయనం చేసింది.

పోలీసులు ‘మహిళా ఫ్రెండ్లీ’
మహిళా దినోత్సవం రోజు నుంచే రాష్ట్రంలో ‘మహిళా ఫ్రెండ్లీ పోలీస్‌’ విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు డీజీపీ కార్యాలయం నుంచి అన్ని పోలీస్‌ స్టేషన్లకు వెళ్లాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం..
ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు, మహిళా మిత్ర, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ సెంటర్, వన్‌ స్టాప్‌ సెంటర్‌తోపాటు ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు బోర్డులో ప్రదర్శించాలి.
పోలీస్‌ స్టేషన్‌లో మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. 
- పోలీస్‌ స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచాలి.
- ప్రతి మహిళను ‘అమ్మా.. తల్లీ, చెల్లీ.. రండి.. కూర్చోండి’ అని గౌరవభావంతో మాట్లాడాలి. 
- పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే మహిళలను కూర్చోబెట్టి వారి సమస్య తెలుసుకుని ధైర్యం కల్పించేలా వ్యవహరించాలి. 
- మహిళల రక్షణను దృష్టిలో ఉంచుకుని వీలైనంత ఎక్కువ మంది మహిళా పోలీసులను వినియోగించాలి.
- తరచూ ఓపెన్‌ హౌస్‌ నిర్వహించి మహిళలను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులు ‘మహిళా ఫ్రెండ్లీ’గా వ్యవహరిస్తారనే ధైర్యం ఇవ్వాలి. 
- మహిళల సమస్యల పరిష్కారంలో అత్యధికంగా మహిళా మిత్రలను, గ్రామ మహిళా సంరక్షణ పోలీసులను భాగస్వాముల్ని చేయాలి.
- అక్రమ మద్యం తయారీని అరికట్టడం, మద్యం బెల్ట్‌ షాపులను లేకుండా చేయడంలో భాగంగా మహిళల్లో చైతన్యం తేవాలి.
- పాఠశాలలు, కాలేజీలు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు, మహిళా మిత్రలు, మహిళ సంరక్షణ పోలీసులతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయాలి. 
- ఆ ప్రాంతాల్లో తరచూ మహిళలకు చైతన్య, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement