జగన్ భద్రత బాధ్యత ప్రభుత్వానిదే
Published Thu, Aug 29 2013 1:13 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
చేవెళ్ల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన అంశంలో అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం జరగాలంటూ జైలులో దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డికి ఏదైనా జరిగితే తెలంగాణతో పాటు సీమాంధ్ర కూడా అగ్నిగుండంగా మారుతుందని ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కె.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కలిసి ఉంటేనే మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
మహానేత రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ విధానాల వల్లనే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని ఆవేదన వ్యక్తంచేశారు. పదేళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడుస్తుంటే అప్పుడే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలనే సంకల్పంతోనే జగన్ జైలులో కూడా అన్నపానీయాలు మాని దీక్ష చేస్తుంటే రాజకీయ లబ్ధికోసమేనని అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ఆరోపించడం సిగ్గుచేటన్నారు. విభజన వల్ల అన్ని ప్రాంతాల వారూ నష్టపోతారని వైఎస్సార్ సీపీ భావిస్తున్నదన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రంగారెడ్డి జిల్లా అన్ని విధాలా వెనుకబడిపోతుందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయన్నారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన చెప్పారు. పార్టీని వీడుతున్నవారంతా రాజకీయ స్వార్థంతోనేనని ఆరోపించారు. జగన్‌కు జైలులో పటిష్టమైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌చేశారు.
Advertisement
Advertisement