
700 ఎంబీబీఎస్ సీట్లకు కోత
* మౌలిక వసతులు కల్పించలేదని ఎంసీఐ కీలక నిర్ణయం
* తెలంగాణలో 150, సీమాంధ్రలో 550 సీట్ల తరుగుదల
* మరో 100 సీట్లకు కూడా కోత పడే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలతో మెడిసిన్ చదవాలనుకున్న విద్యార్థుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 700 ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. ఢిల్లీలో బుధవారం జరిగిన భారతీయ వైద్యమండలి (ఎంసీఐ) కార్యనిర్వాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో గాంధీ, ఆంధ్రా, గుంటూరు, సిద్ధార్థ, రంగరాయలాంటి ప్రముఖ కళాశాలలకూ మినహాయింపునివ్వలేదు. త్వరలో మరో 100 సీట్లకూ కోత పడనుందని తెలుస్తోంది. గత కొన్నేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వ వైద్య సీట్లకు ఇంత భారీగా కోత విధించిన దాఖలాలు లేవు. చివరకు జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ సీట్లకు ఇంతగా కోత పడలేదు. ఈ ఘనతను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ కళాశాలల్లో 2,450 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అయితే మౌలిక వసతులు కల్పించలేదని, రోగులకు తగిన పడకలు లేవని, తగిన సంఖ్యలో సిబ్బంది లేరన్న ప్రధాన కారణాలతో 10 కళాశాలల్లోని 600 సీట్లకు కోత విధించారు. మరో వంద సీట్లకు నెల్లూరు కొత్త కళాశాలకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పర్యవేక్షించేందుకు ఇద్దరు వైద్య సంచాలకులు ఉన్నప్పటికీ ఈ నష్టాన్ని నివారించలేకపోయారు. ఫలితంగా తెలంగాణ 150, సీమాంధ్ర 550 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయాయి. ఇక ప్రభుత్వ కళాశాలల్లో కేవలం 1,850 సీట్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర చరిత్రలో ఇంత దురదృష్టకర పరిస్థితి ఎప్పుడూ లేదని వైద్యరంగ నిపుణులు వాపోతున్నారు.